బాబు అపుడే రిటైర్ అవుతారా ?
ఏపీలో వారసత్వం గురించి చర్చ అయితే జోరుగా సాగుతోంది. కానీ నిజానికి చూస్తే కనుక ఏపీ సీఎం చంద్రబాబు వయసు ఒక టెక్నికల్ ఇష్యూగానే అంతా చూస్తున్నారు.
By: Tupaki Desk | 23 Jan 2025 8:30 AM GMTఏపీలో వారసత్వం గురించి చర్చ అయితే జోరుగా సాగుతోంది. కానీ నిజానికి చూస్తే కనుక ఏపీ సీఎం చంద్రబాబు వయసు ఒక టెక్నికల్ ఇష్యూగానే అంతా చూస్తున్నారు. బాబు వయసు ఏడున్నర పదులు అని ఎవరైనా అనుకుంటేనే తప్ప తెలిసేది కాదు. ఎందుకంటే బాబు అంత హెల్తీగా ఉంటారు. అంతే కాదు ఆయన క్రమశిక్షణ ఆయన దూకుడు ఆయన గంటల తరబడి పనిచేసే విధానం ఇవన్నీ చూసిన వారు బాబు ఇపుడిపుడే రిటైర్ అవుతారు అని అసలు అనుకోరు.
చంద్రబాబు ప్రస్తుత హెల్తీ కండిషన్ చూసుకుంటే కనుక ఆయన మరో టెర్మ్ కూడా ఇదే ఊపులో సీఎం గా పని చేయగలరని అంతా ఒప్పుకుంటారు. ఒక ఏపీలో 2014లో అయినా 2024లో అయినా బాబుని చూసే జనాలు ఓటు వేశారు అన్నది నిర్వివాదమైన అంశం. చంద్రబాబు విజనరీ అని అనుభవశాలి అని ఆయన మాత్రమే ఏపీని గట్టెక్కించగలరని నమ్మే జనాలు ఆయనకు నాలుగోసారి కూడా పగ్గాలు అప్పగించారు.
ఇక చంద్రబాబు వైపు నుంచే ఆయనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆయన ఏపీకి బ్రహ్మాండమైన రాజధానిగా అమరావతిని నిలపాలని చూస్తున్నారు. ఆ విషయంలో ఆయన పట్టుబట్టి ఉన్నారు. అందువల్ల చంద్రబాబు అమరావతి రాజధాని ఒక షేప్ కి వచ్చేంతవరకూ సీఎం గా కచ్చితంగా కొనసాగుతారు అని అంటున్నారు.
అలాగే 1940 నాటి కల అయిన పోలవరాన్ని తానే పరిపూర్తి చేసి ఆంధ్ర జాతికి అంకితం చేయాలన్న పట్టుదల కూడా బాబుకు ఉంది. అందువల్ల ఆ ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన పూర్తి అయ్యేంతవరకూ అధికార పగ్గాలను వదిలేది లేదు అని అంటున్నారు.
ఇక ఏపీలోని అన్ని ప్రాంతాల సమగ్రమైన అభివృద్ధి బాబు అజెండాగా ఉంది. అలాగే ఏపీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకుని రావాలని చూస్తున్నారు. ఏపీని దేశంలో కీలకమైన రాష్ట్రంగా ఉంచాలని తపిస్తున్నారు. అందువల్ల చంద్రబాబు ఇప్పటప్పట్లో అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే చాన్సే లేదని అంటున్నారు.
ఇక బాబు తాను అనుకున్న పనులలో కొన్ని అయినా చేసి 2029లో జనం ముందుకు వెళ్తారని అపుడు వారు మరోసారి అనుకూలంగా తీర్పు ఇస్తారని దాంతో ఐదవసారి కూడా ఆయనే సీఎం గా ఉండి ఏపీలో మొత్తం చేయాల్సిన పనులు పూర్తి చేసి కానీ సీఎం సీటు నుంచి దిగేదే ఉండదని అంటున్నారు. సో బాబుకు వారసులు తయారు చేయడం అన్నది ఇప్పటికపుడు చర్చించే విషయం కాదు, అది అంత అవసరమైన మ్యాటర్ కూడా కాదని అంటున్నారు. జనం వైపు నుంచి చూసినా చంద్రబాబే ఏపీకి సీఎం గా చాలా కాలం కొనసాగాలని అనుకుంటున్నారని అంటున్నారు. అదన్న మాట సంగతి.