Begin typing your search above and press return to search.

బాబు గారూ.. హెచ్చరికలతోనే సరా ?

ఇవన్నీ పక్కన పెడితే ఎమ్మెల్యేల వివరాలు అన్నీ తన దగ్గర ఉన్నాయని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 5:30 AM GMT
బాబు గారూ.. హెచ్చరికలతోనే సరా ?
X

టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో పలు సూచనలు సలహాతో పాటు కొన్ని హెచ్చరికలు కూడా చేశారు ఆయన వారికి దిశా నిర్దేశం చేస్తూనే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చెప్పేశారు. అలా కనుక ఉంటే ఆ తరహా ఆరోపణలు వస్తే ఉపేక్షించేది లేదని కూడా పక్కా క్లారిటీ ఇచ్చారు.

ఇక పార్టీ ఎమ్మెల్యేల పనితీరు వారు క్షేత్ర స్థాయిలో ఎలా వ్యవహరిస్తున్నారు అన్నది పూర్తిగా పరిశీలన చేయడానికి అయిదురుగురు సభ్యులతో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అధ్యక్షతన ఒక కమిటీని వేస్తున్నామని ఆ కమిటీ ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ అధినాయకత్వం చెప్పిన విధానానికి భిన్నంగా పనిచేసినట్లు అయితే మాత్రం తొలి హెచ్చరికలను ఆ కమిటీ చేస్తుందని అంటున్నారు. ఆ తరువాత కూడా తీరు మార్చుకోకపోతే అపుడు అధినాయకత్వం దృష్టికి విషయం వెళ్తుందని ఆ మీదట చర్యలు ఉంటాయని బాబు కచ్చితంగా చెప్పేశారు.

ఇవన్నీ పక్కన పెడితే ఎమ్మెల్యేల వివరాలు అన్నీ తన దగ్గర ఉన్నాయని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు. మరో వైపు చూస్తే ఉచిత ఇసుక వ్యవహారంలో కానీ కొత్తగా స్టార్ట్ అయిన లిక్కర్ పాలసీ మేరకు మందు షాపుల వ్యవహారంలో కానీ చాలా మంది ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్ లో దందాలు స్టార్ట్ చేశారు అని అంటున్నారు. ఎమ్మెల్యేల విషయం గురించి అనుకూల మీడియాలోనే కొన్ని వార్తలు వచ్చాయని కూడా చెబుతున్నారు.

ఇక పార్టీ అధినాయకత్వానికి కూడా ఈ మేరకు నివేదికలు ఉన్నాయని చెబుతున్నారు. మరి అన్నీ తెలిసి కూడా ఇంకా కమిటీలు వారి ముందస్తు హెచ్చరికలు ఆ మీదట ఆ కమిటీ ఇచ్చే నివేదికలు, వాటిని అధినాయకత్వం పరిశీలించడాలు, ఫైనల్ డెసిషన్లు ఇంత దాకా అవసరమా అన్న చర్చ అయితే ఉంది.

ఏ పార్టీకి అయినా ఎమ్మెల్యేలే బలం, వారి వైఖరి బాగా లేనపుడు అదే ఇబ్బంది కూడా. వారు మంచిగా ఉంటేనే జనంలో ప్రభుత్వం మీద సానుకూలత కనిపిస్తుంది. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలే అయిదేళ్ల పాటు జనంలో ఉన్నారు. వారు ఏ విధంగా ఉన్నారో చూసి మరీ జనాలు ప్రభుత్వం మీద ఒక తీర్పు ఇచ్చారు. అది అత్యంత చేదుగా కఠినంగా ఉంది. పైన జగన్ మీద సానుకూలత ఉందో లేదో కానీ దిగువన మాత్రం గ్రౌండ్ లెవెల్ లో వైసీపీ మీద దారుణమైన నెగిటివిటీ వచ్చే పార్టీ 11 సీట్లకు పరిమితం అయింది.

ఇపుడు చూస్తే చంద్రబాబు విషయంలో ఎవరికీ అపనమ్మకం లేదు. ఆయన ఏడున్నర పదుల వయసులో బాగా కష్టపడుతున్నారు అని అందరి భావనగా ఉంది. దానికి తోడు ఆయన ఏపీకి మేలు చేయాలని తపనతో ఉన్నారు. మరి బాబు బాగా ఉంటే సరిపోతుందా అంటే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా బాగా ఉండాలి. అందరూ అని కాదు కానీ కొందరి విషయంలో ఆరొపణలు అయితే వస్తున్నాయి. వాటిని సరిచేసి ఇప్పటి నుంచే చక్కబెడితేనే పార్టీకి మేలు అని అంటున్నారు. అలా కాకుండా మెత్తమెత్తగా హెచ్చరికలు చేస్తూ పోతూంటే అదే చివరికి ఇబ్బందిగా మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.సో బాబు మాటలతో కాదు చేతలకు దిగాలని అంటున్న వారూ ఉన్నారు. మరి అన్నీ తెలిసిన అపర చాణక్యుడు బాబు ఏ విధంగా ముందుకు ఆగుతారో చూడాల్సిందే.