Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ దెబ్బేస్తోందే బాబూ !

అన్న ఎన్టీఆర్ కి ఆగస్టు నెల సంక్షోభాలకు కేరాఫ్ గా మారిన మంత్ గా ఉండేది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 4:13 AM GMT
సెప్టెంబర్ దెబ్బేస్తోందే బాబూ !
X

అన్న ఎన్టీఆర్ కి ఆగస్టు నెల సంక్షోభాలకు కేరాఫ్ గా మారిన మంత్ గా ఉండేది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ రెండు సార్లూ ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురి అయింది మాత్రం అచ్చంగా ఆగస్టు నెలలోనే. ఇపుడు అదే విధంగా యాంటీ సెంటిమెంట్ చంద్రబాబుకు సెప్టెంబర్ మంత్ లో తగులుకుందా అన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే గత ఏడాది ఇదే సెప్టెంబర్ నెల 9వ తేదీన చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళారు. బాబు రాజకీయ జీవితంలో అదే తొలిసారి జైలు జీవితం.

ఆ విధంగా బాబుకు జీవిత కాలం గుర్తుండిపోయే నెలగా సెప్టెంబర్ అతి బరువైన చేదు అనుభవం మిగిల్చింది. ఇక ఏడాది కాలం తిరిగేసరికి ఈ సెప్టెంబర్ మంత్ లో బాబు సీఎం అయిపోయారు. అయితే ఆయన సీఎం గా ఈ నెల కులాసాగా గడచిందా అంటే లేదు అనే చకచకా సాగిన రాజకీయ పరిణామాలు తెలియచేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.

సెప్టెంబర్ వస్తూనే విజయవాడను భారీ వరదలతో ముంచేసింది. కనీ వినీ ఎరగని ఆ ప్రకృతి ప్రకోపానికి బెజవాడ రోజుల తరబడి నీట మునిగి పూర్తిగా నానింది. ఎంత చేసినా ఇంకా చేయాల్సి ఉంది. అక్కడ అంతా మొదటి నుంచి చేయాల్సి ఉంది. అంతే కాదు కలల రాజధాని అమరావతి మీద నీలి నీడలు కమ్ముకునేలా భారీ వరదలు అక్కడ కూడా జల ఖడ్గాన్ని ప్రయోగించాయి. ఈ విషయంలో బాబు పాలనా పరంగా విమర్శలను కూడా పెద్ద ఎత్తున ఎదుర్కొన్నారు

ఇలా సెప్టెంబర్ నెలలో సగం రోజులకు పైగా బాబు వీటి మీద యుద్ధం చేస్తూనే గడిపారు. ఈ సందంట్లో ఈ ఏడాది పెళ్ళి రోజు కూడా బాబు సరదాగా జరుపుకోలేక పోయారు. మరో వైపు చూస్తే సెప్టెంబర్ 18న ఆయన ఎన్డీయే సమావేశంలో శ్రీవారి లడ్డూల మీద చేసిన కామెంట్స్ కి సెప్టెంబర్ నెల చివరిలో సుప్రీం కోర్టు వ్యాఖ్యల ద్వారా తప్పు పట్టింది.

సీఎం సీటులో ఉన్న వారికి ఈ వ్యాఖ్యలు ఇబ్బందిని కలిగించేవే. గతంలో అయితే ఇలాంటి వ్యాఖ్యలు వచ్చిన వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేవారు. అయితే ఇపుడు అలాంటి పరిస్థితులు లేవు. కారణం ఏంటి అంటే అంతటా రాజకీయం ఉంది. ప్రతీ వారూ ఏదో ఒక దాని మీద కోర్టులకు వెళ్తున్నారు. అలా ఎన్ని సార్లు రాజీనామాలు చేయాల్సి వస్తుంది ఈ రాజకీయ న్యాయ పోరాటాలకు అన్న చర్చ కూడా ఉంది.

ఏది ఏమైనా బాబు ఇమేజ్ ని దెబ్బ తీసే విధంగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. దాంతో టీడీపీతో పాటు బాబు కూడా ఇరుకున పడాల్సి వస్తోంది అని అంటున్నారు. వంద రోజుల కూటమి పాలన సంబరాలు సాఫీగా సాగనీయకుండా ఈ లడ్డూ వివాదంతోనే అంతా గడచిపోయింది.

దీని కంటే ముందు 2015 సెంప్టెంబర్ లో కూడా ఓటుకు నోటు కేసు అంటూ చంద్రబాబుని ఇదే నెల ఇబ్బంది పెట్టింది అని గుర్తు చేస్తున్నారు. ఇలా చూస్తూ ఉంటే సెప్టెంబర్ నెల అంటేనే జడుసుకునేలా ఉందని అంటున్నారు. టీడీపీకి అసలే సెంటిమెంట్లు ఎక్కువ. మొత్తానికి అమ్మో సెప్టెంబర్ నెల అని వణికాల్సిందేనా అన్న చర్చ అయితే సాగుతోంది.