చంద్రబాబుకు మైదుకూరు విష్ణు వందన వినతులు..24 గంటల్లో ఫలితం వచ్చేసింది
తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చెప్పాలి. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో ఇటీవల పర్యటించిన సంద్భంగా చంద్రబాబు.. అక్కడ విష్ణుప్రియ అనే మహిళ ఇంటికి వెళ్లారు.
By: Tupaki Desk | 20 Jan 2025 9:30 AM GMTగత ఎన్నికల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అంతకు ముందు ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన వేళలో ఆయనకు ఎదురైన చేదు అనుభవాలు ఆయన తీరును మార్చేసినట్లుగా చెప్పాలి. సందర్భం ఏదైనా.. తన నోటి నుంచి హామీ వచ్చినంతనే సూపర్ స్పీడ్ తో జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చెప్పాలి. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో ఇటీవల పర్యటించిన సంద్భంగా చంద్రబాబు.. అక్కడ విష్ణు వందన అనే మహిళ ఇంటికి వెళ్లారు.
స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాంలో భాగంగా విష్ణు వందన ఇంటికి వెళ్లారు. ఆమె ప్రత్యేకత ఏమంటే.. తడిపొడి చెత్తను వేరు చేయటం.. చెత్తతో సంపదను క్రియేట్ చేస్తూ.. ఇంటి ఆవరణలో కూరగాయల సాగు చేస్తున్న ఆమెను చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించటంతో పాటు.. తమకు సాయం చేయాలని కోరుతూ వినతిపత్రాల్ని అందజేశారు. ఆ ఫ్యామిలీ నుంచి మొత్తం ఆరు వినతులు రాగా.. రెండింటిని 24 గంటల్లోనే నెరవేర్చటం ఆసక్తికరంగా మారింది.
విష్ణు వందన మామకు పింఛను మంజూరు చేయటంతో పాటు.. ఆమె భర్త వీరప్రసాద్ కు ఉపాధి కోసం వెల్డింగ్ మిషన్ ను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఉన్న ఆమె తోడికోడలు ఉమాలక్ష్మీదేవికి ఇంటి వద్దే చికిత్స అందజేశారు. ఇక.. ఆమె కోరిన ఉద్యోగం.. తోడికోడలు ఉమా లక్ష్మీదేవి భర్తకు వాహనాన్ని కొనేందుకు ఆర్థిక సాయం.. సుబ్బారాయుడి కుమార్తె కుమారుడు నీరజ్ చంద్ కు జాబ్ విషయాల్ని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం కలెక్టర్ చొరవ తీసుకొని.. సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చిన తీరు ఆసక్తికరంగా మారాయి.గతానికి భిన్నంగా సూపర్ స్పీడ్ తో సమస్యలకు పరిష్కారాలు లభించటం చంద్రబాబు ఇమేజ్ ను పెంచుతుందని చెప్పాలి.