టార్గెట్ వైసీపీ.. చంద్రబాబు 'మిషన్ 2.0' స్టార్ట్ ...!
రాజకీయాలన్నాక.. రాజకీయాలే. శత్రుశేషాన్ని మిగలాలని ఏ పార్టీ కూడా కోరుకోదు.
By: Tupaki Desk | 22 Oct 2024 5:30 AM GMTరాజకీయాలన్నాక.. రాజకీయాలే. శత్రుశేషాన్ని మిగలాలని ఏ పార్టీ కూడా కోరుకోదు. ఎంత బలహీన పడితే .. అంత మంచిదని భావిస్తుంది. అందుకే.. వైసీపీ హయాంలోనూ టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుం డా చేయాలని అప్పటి ముఖ్యమంత్రిగా జగన్ ఆలోచన చేశారని అంటారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను లాగేసుకున్నారని కూడా చెబుతారు. ఇక, 2017-18 మధ్య వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్న చంద్రబాబు.. తన సీటును కాపాడుకునే ప్రయత్నం చేశారు.
ఎందుకంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు తమవైపు చూస్తున్నారంటూ.. ఉమ్మడి ఏపీలో రాజ్‌భవన్ వద్ద.. నాటి విపక్ష నాయకుడు జగన్ చెప్పడమే కారణం. కాబట్టి.. ఎవరైనా శత్రుపక్షాన్ని నిర్వీర్యం చేయాలనే కోరు కుంటారు. ఇది తప్పు కూడా కాదు. అయితే.. నియంతృత్వ దేశాల్లో నేరుగా దాడులు ఉంటాయి. ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల రూపంలో ఉంటాయి. ఇక, ఇప్పుడు కూటమి పార్టీలు కూడా.. వైసీపీని టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే.
దీనిలో భాగంగా ఇప్పుడు మిషన్ 2.0ను అమలు చేస్తున్నారన్నది రాజకీయ పరిశీలకుల మాట. మిషన్ 1.0 లో వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. కొన్నేళ్ల కిందటి కేసులను కూడా తిరగదోడారు. ఎవరెవరికి భాగస్వా మ్యం ఉందో తేల్చుకున్నారు. వారందరి పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక.. క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు రెచ్చిపోయినా.. అధినాయకులు మౌనంగా ఉన్నారు. ఇంతలో జగన్ ఢిల్లీ వెళ్లి యాగీ చేసేసరికి మిషన్ 1.0ను పక్కన పెట్టారు. ఇక, ఇప్పుడు మిషన్ 2.0 తెరమీదికి వచ్చింది.
ఇది పక్కాగా అమలు చేస్తున్నారు. ఎక్కడా ఆరోపణలు లేవు. ఎక్కడా డొంకతిరుగుడు కూడా లేదు. కేసులు జోరుగా సాగుతున్నాయి. కీలక నాయకులను విచారణ చేస్తున్నారు. మాజీ ఎంపీల నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా విచారిస్తున్నారు. దీని అనంతరం.. సమయం చూసుకుని మిషన్ 3.0ను తెరమీదికి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అంటే.. ఇక, అరెస్టుల పర్వం.. జైళ్లు వంటివి తెరమీదికి రానున్నాయి. మిషన్ 1.0లో తప్పించుకున్న వైసీపీ.. మిషన్ 2.0, 3.0లలో మాత్రం తప్పించుకునే అవకాశం లేకుండా అష్ట దిగ్భంధనం చేస్తుండడం గమనార్హం.