బాబులో 1995 నాటి సీఎం కనిపిస్తున్నారా ?
దీని మీద బాబు రియాక్ట్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా 1995 నాటి సీఎం అన్న రిఫరెన్స్ ని ఆయన తీసుకుని వచ్చారు.
By: Tupaki Desk | 9 Nov 2024 8:30 PM GMTతాను 1995 నాటి సీఎం ని అని మరోసారి విజయవాడ టు శ్రీశైలం సీ ప్లెయిన్ జర్నీ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను చేతల మనిషిని అన్నారు. సంస్కారం సభ్యత లేని వారి విషయంలో ఏమి చేయాలో ఎలా చేయాలో అన్నీ చేస్తాను అని హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులు రాతల మీద బాబు ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఏపీలో ఇపుడు ఇది హాట్ టాపిక్ గా ఉంది. వైసీపీ నేతలు అయితే తమ వారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అని ఆందోళన చేస్తున్నారు. దీని మీద బాబు రియాక్ట్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా 1995 నాటి సీఎం అన్న రిఫరెన్స్ ని ఆయన తీసుకుని వచ్చారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే మరి కొద్ది రోజులలో 2024 పోయి 2025 వస్తుంది. అంటే 1995కి ముప్పయ్యేళ్ళ ముందుకు కాలం వచ్చేసింది.
మళ్లీ ఆనాటి వైఖరి ఆ కాలం తీరు ఎలా వస్తాయి. ఎవరికైనా ఇది సాధ్యం కాదేమో. ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన 1995 నాటికి 45 ఏళ్ల వయసున్న వారు, ఫుల్ జోష్ లో ఉండేవారు, ఆ హుషారు ఆ జోరు వేరే లెవెల్ అని కూడా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆనాడు ఆయన పాలనలో సంస్కరణలు తెచ్చారు.
ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా ఉద్యోగుల అలసత్వానికి బ్రేకులు వేశారు. ఎక్కడా కూడా ఎవరూ ఏ తప్పూ చేయకుండా కఠినంగా చూసారు. ఫలితంగా ఆయనకు 1999 లో తక్కువ సీట్లు వచ్చాయి. అయినా అధికారం దక్కింది. 2004లో పూర్తిగా అధికారం పోయింది. దాంతో ఉద్యోగులతో పెట్టుకోవడం వల్లనే అని గ్రహించి బాబు బాగా తగ్గిపోయారు.
ఇక 1995లో చూస్తే బాబు ఏ విషయం మీద అయినా పూర్తి ఫోకస్ పెట్టారూ అంటే అది మొత్తం అంతు చూడాల్సిందే అన్నట్లుగా ఉండేవారు. ఆయన తాను నిద్రపోనూ మరొకరిని నిద్రపోనీయను అని ఒక స్లోగన్ ఎత్తుకుని అధికారులతో పాటు మంత్రులను ప్రభుత్వాన్ని మొత్తం పరుగులు పెట్టించారు.
ఇక విభజన ఏపీలో 2014లో సీఎం అయిన బాబు తీరు కూడా మారింది. ఆయనలో 1995 సీఎం ని చూసి జనాలు ఓట్లేసినా ఆయన మాత్రం పదేళ్ల విపక్ష పాత్ర తరువాత కొత్త బాబుగానే జనాలకు కనిపించారు అని అంటారు. ఆ అయిదేళ్ళ పాలనలో ఆశ్రిత పక్షపాత్రం అవినీతి వంటి వాటి మీద విమర్శలు వచ్చాయి. చివరికి ప్రభుత్వం 2019లో ఓటమి పాలు అయింది. ఇక ఉద్యోగులకు ఆ టైంలో ఫ్రీ డం కూడా బాగా ఇచ్చేశారు అన్న విమర్శలు వచ్చాయి.
ఇపుడు చూస్తే బాబు 2024లో సీఎం అయ్యారు. ఇది నాలుగోసారి. అయితే 2014 బాబుకు ఇప్పటి బాబుకు మధ్య కూడా మరో తేడా ఉందని అంటున్నారు. ఈసారి బాబు సీఎం అయినా ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఉన్నారు. అలాగే కుమారుడు లోకేష్ మరో వైపు ఉన్నారు. అలా చంద్రబాబు ఒక్కరే స్టీరింగ్ తిప్పటం లేదు అన్నది కూడా ఒక చర్చగా అయితే జనాల్లో ఉంది అని అంటున్నారు.
బాబు పాలనాపరంగా 1995 నాటి సంస్కరణలు అయితే అమలు చేయడం లేదు అన్నది 2014లోనే తేలిన వ్యవహారం కాబట్టి ఇప్పుడు కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్ గానే ఉద్యోగులతో ఉంటున్నారు. ఇక గతానికి ఇప్పటికె మరో తేడా ఏంటి అంటే బాబు అప్పట్లో చాలా దూకుడుగా ఉండేవారని అంటారు. ఇపుడు తగ్గింది అన్నది కూడా ఉంది.
ఇక బాబుతో నాడు కాంగ్రెస్ వైఎస్సార్ ఇతర కాంగ్రెస్ నేతలు ప్రత్యర్ధులుగా రాజకీయ పోరాటం చేసినా హద్దులు ఎవరూ దాటేవారు కాదు, ఇపుడు మాత్రం అటూ ఇటూ కూడా దూకుడే కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే 1995 నాటి బాబుని అని ఆయన ఎంత చెప్పినా ఆనాటి డైనమిక్ నేచర్ ని చూసిన వారు మాత్రం మళ్ళీ ఆ రోజులు వస్తాయా అని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఇది. బాబు తో పాటు పవన్ మాటా చెల్లుతోంది. లోకేష్ ఆధిపత్యమూ నడుస్తోంది. సో బాబు 2024 సీఎం గానే ఉన్నారనే అంటున్నారు. రాజకీయాల్లో కాలానికి తగినట్లుగా మారడం అవసరం. బాబు అదే చేస్తున్నారు అనుకోవాల్సిందే.