Begin typing your search above and press return to search.

‘జైల్లో మొదటి రాత్రి ఎలా గడిచింది?’ ప్రశ్నకు చంద్రబాబు ఆన్సర్ ఇదే

ఆ రాత్రి చేయని తప్పునకు శిక్ష అనుభవించడం కాకుండా.. అది జరిగిన విధానం ఆలోచించినప్పుడు గుండె తరుక్కుపోయింది.

By:  Tupaki Desk   |   26 Oct 2024 7:33 AM GMT
‘జైల్లో మొదటి రాత్రి ఎలా గడిచింది?’ ప్రశ్నకు చంద్రబాబు ఆన్సర్ ఇదే
X

సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆరోపణలు ఎన్ని ఉన్నా.. అరెస్టు వరకు చంద్రబాబు వెళ్లింది లేదు. అందుకు భిన్నంగా ఆయన్ను జగన్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. జైలుకు వెళ్లిన చంద్రబాబు.. ఇట్టే తిరిగి వచ్చేస్తారని భావించినా.. ఏకంగా 53 రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా.. ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం వ్యవహరించిన చంద్రబాబు రాజకీయ జీవితంలో జైలు జీవితం ఒక షాకింగ్ అనుభవం. జైల్లో మొదటి రాత్రి ఎలా గడిచిందన్న అంశంపై వివరంగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. మీ జైలు జీవితంలో తొలి రాత్రి ఎలా గడిచిందన్న ప్రశ్నను అడిగిన వారు లేరు. ఆ కొరతను తీర్చారు తన షోతో బాలక్రిష్ణ. ఆయన అడిగిన ప్రశ్నకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చూస్తే..

''నంద్యాల నుంచి ప్రకాశం జిల్లా ద్వారా అడవులు దాటుకుంటూ అమరావతికి తీసుకొచ్చారు. రాత్రంతా ఇన్వెస్టిగేషన్‌ పేరుతో తిప్పారు. తెల్లవారాక మెడికల్‌ టెస్ట్‌కు పంపించారు. అక్కడ నుంచి మళ్లీ అక్కడా ఇక్కడా తిప్పితిప్పి కోర్టుకు తీసుకొచ్చారు. వాదనల నెపంతో సాయంత్రం దాకా ఉంచి అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు పంపారు. ఆ రాత్రి చేయని తప్పునకు శిక్ష అనుభవించడం కాకుండా.. అది జరిగిన విధానం ఆలోచించినప్పుడు గుండె తరుక్కుపోయింది. నేను చేయని తప్పునకు ఈ శిక్షేంటి అని ఆ రాతంత్రా ఆలోచించా. నేను నైతికస్థైర్యం కోల్పోతే ఇకేమీ ఉండదని ఆలోచించి ధైర్యంగా ఉన్నా. నన్నుశారీరకంగా దెబ్బతీయలేక.. మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు'' అని పేర్కొన్నారు.

తన జీవితంలో కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేదని.. తెలుగుజాతి.. దేశం బాగుండాలనే పనిచేసిన విషయాన్ని చెప్పిన చంద్రబాబు.. ''నా కోసం పోరాడుతున్న ప్రజల కోసం నా శేష జీవితం అంకితం చేయాలని జైల్లో ఉన్నంత కాలం ఆలోచించేవాడ్ని. చాలామంది నాయకుల్ని వారు మరణించిన తర్వాత ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఒక నాయకుడికి కష్టం వస్తే ప్రజలు ఎంత తీవ్రంగా స్పందిస్తారనేదానికి నా అరెస్టు అనంతర ఘటనలే నిదర్శనం' అని చెప్పారు. జైల్లో ఉన్నప్పుడు ఎదురైన ఘటనల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాను కాబట్టి నా జోలికి రాలేకపోయారు. అదే కానీ లేకపోతే ఏమయ్యేదో? ఒక్కటే ఆలోచించాను.. చనిపోతే ఒక్క క్షణం. అనుకున్న ఆశయాల కోసం పనిచేస్తే అదే శాశ్వతం. అదే నన్ను ముందుకు నడిపించింది'' అని చెప్పారు.

జైల్లో నేను గడిపిన రోజుల గురించి పుస్తకాలు రాయొచ్చున్న చంద్రబాబు.. తాను ఏ తప్పు చేయలేనప్పుడు ఎవరికీ భయపడదాల్సిన అవసరం లేదన్నారు. చరిత్రలో ఒక్కోసారి కొందరికి పరీక్షలు ఎదురవుతాయన్న ఆయన.. లాంటిదే తనకు వచ్చిందనుకున్నానని చెప్పారు. ''ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనే ధ్రఢ సంకల్పం ఇవ్వాలని నా ఇష్టదైవం వెంకటేశ్వరస్వామిని ప్రతి క్షణం ప్రార్థించేవాడ్ని'' అని పేర్కొన్నారు.

తాను జైల్లో ఉంటే తన సతీమణి భువనేశ్వరి.. కోడలు బ్రాహ్మణి రాజమహేంద్రవరంలోనే ఉన్నారన్న చంద్రబాబు.. '' ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం లోకేశ్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. నాకు జరిగిన అన్యాయంపై బయట ప్రజలు పోరాడుతుంటే.. వారికి నా కుటుంబ సభ్యులే నాయకత్వం వహించారు.భువనేశ్వరి ఒక ముఖ్యమంత్రి కుమార్తెగా.. ఒక ముఖ్యమంత్రి భార్యగా ఉన్నా ఎప్పుడూ రాజకీయాల్లోకి బయటకు రాలేదు. అలాంటిది నా కోసం పగలూ రాత్రీ ప్రజల్లోనే ఉంటూ పోరాడారు' అని అప్పటి పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు.