Begin typing your search above and press return to search.

బాబు నోట సనాతనం...పవన్ కి పోటీగా ?

ఇక సనాతన ధర్మం అంటూ కొద్ది నెలల క్రితం తిరుపతి వీధులలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే మాట్లాడారు.

By:  Tupaki Desk   |   18 Feb 2025 6:56 AM GMT
బాబు నోట సనాతనం...పవన్ కి పోటీగా ?
X

సనాతనం అన్న పదం ఇపుడు ఏపీ రాజకీయాల్లో బాగా పాపులర్ అవుతోంది. ఈ పదాన్ని వాడినది గతంలో ఎంతో మంది ఉండొచ్చు కాక కానీ ఇటీవల కాలంలో వెండి తెర వేలుపు అశేష విశేష జనాభిమానం కలిగిన జనసేనాని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ వాడారు. దాంతో అది ఎంతగానో పాపులర్ అయిపోయింది.

అర్థం తెలియకున్నా చాలా మందికి అది నచ్చేస్తోంది. సనాతనం అన్న పదం గంభీరంగా ఉంది. ఇక సనాతన ధర్మం అంటూ కొద్ది నెలల క్రితం తిరుపతి వీధులలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే మాట్లాడారు. అంతే కాదు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని డిమాండ్ కూడా చేశారు.

ఆయన వారాహీ సభ డిక్లరేషన్ గా దానిని చేశారు. ఇక ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి ఉండాలని గతంలో సాధు సంతులు కోరినా అది పెద్దగా జన బాహుళ్యంలోకి వెళ్ళలేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ డిమాండ్ చేశారో అది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. అంతే కాదు అప్పట్లో నేషనల్ చానల్స్ లో బిగ్ డిబేట్ గా కూడా సాగింది.

దానికి ఆధ్యాత్మికవేత్తలు సాధు పరివారం మఠాధిపతులు అంతా కూడా మద్దతు కూడా ఇచ్చారు. ఇటీవల కాలంలో మహా కుంభ మేళ కు వచ్చిన కేంద్ర హోం మంత్రిని కలసిన సాధు సంతులు అంతా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేసేదాకా వెళ్ళారు. దీనిని మూలం ఎంతో కొంత పవన్ కళ్యాణ్ అన్నా తప్పు లేదు.

ఇక సనాతనం అన్న పదం రాజకీయంగా కూడా కీలకంగా మారుతోంది. ఎవరు సనాతని ఎవరు ఆధునిక జీవి అన్న చర్చను మేధావులు లెఫ్ట్ భావజాలం ఉన్న వారు లేవనెత్తుతూ వచ్చారు. అలా రైటిస్ట్ లెఫ్టిస్టు భావజాలం మధ్య మరో మారు ఇది ఒక డిబెట్ గా మారింది.

ఈ విషయం అలా ఉంచితే పవన్ కి సనాతనవాదిగా అయితే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చింది. అంతే కాదు. ఆయన భావజాలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సరిపోయేలా ఉందని వ్యాఖ్యానాలు వినిపించాయి. ఇటీవల పవన్ ఆధ్యాత్ర్మిక యాత్రను చేపట్టడం ద్వారా సనాతన ధర్మం పట్ల తనకు ఉన్న భక్తిని మరోమారు చాటుకున్నారు.

కట్ చేస్తే ఇపుడు అదే సనాతనం అన్న పదం కూటమి పెద్ద ఏపీ సీఎం చంద్రబాబు నోట కూడా వినిపిస్తోంది. ఇది ఆశ్చర్యకరమైనది గానే అంతా చూస్తున్నారు. చంద్రబాబు నిన్నా మొన్నటి నాయకుడు కాదు, దాదాపుగా అర్ధ శతాబ్దం రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. ఆయన ఇంతటి సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో సనాతనం అన్న మాటను అయితే వాడినట్లుగా ఎవరికీ గుర్తు అయితే లేదు.

కానీ చంద్రబాబు మొదటిసారి ఈ మాట వాడారు. అది కూడా అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో. ఇంతకీ అక్కడ చంద్రబాబు ఏమన్నారూ అంటే సనాతన ధర్మ పరిరక్షణలో అంతా కీలకమైన పాత్ర పోషించాలని ఆయన పిలుపు ఇచ్చారు. హిందూ సిక్కు, జైన బౌద్ధ మతాలు అన్నీ కలసి సనాతన ధర్మాన్ని కాపాడాలని బాబు కోరారు.

తిరుపతిలో జరిగిన ప్రపంచ దేవాలయాల సదస్సుకు బాబు ముఖ్య అతిధిగా హాజరై కీలక ఉపన్యాసం చేశారు. ఆయన దేవాలయాల ప్రాశస్త్యం గురించి కూడా గట్టిగా చాటారు దేశంలో ఉన్న దేవాలయాలు మన ఆస్తి మన అస్తిత్వం అని కూడా ఆయన గొప్పగా చెప్పారు. అంతే కాదు సనాతన ధర్మానికి అవి నిదర్శనం అని చెబుతూనే వాటికి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని అన్నారు.

బాబు ఈ విధంగా సనాతన ధర్మం గురించి బలంగా చెప్పడం మీదనే చర్చ సాగుతోంది. చంద్రబాబు నోట ఈ మాట రావడం కూడా చర్చనీయాంశం అవుతోంది. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ పవన్ ఎలుగెత్తి చాటిన తరువాత ఆయనకు హిందూ సమాజంలో ఎనలేని గౌరవం దక్కుతోంది. పవన్ ని హిందూ జన బాంధవుడిగా చూసే వారు అధికమవుతున్నారు.

దేశంలో హిందూత్వ కార్డుతో బీజేపీ ఎంతటి విజయాలు సాధ్స్తోందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడడం ద్వారా దేశంలో అతి పెద్ద సమూహంగా ఉన్న హిందూ సమాజంలో తన ప్రతిష్టను ఇంతకు ఇంతా పెంచుకోవాలని చూస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. అదే సమయంలో కూటమి మిత్రుడు పవన్ తో పోటీ పడుతున్నారా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది.