Begin typing your search above and press return to search.

తిరుమ‌ల ప్రక్షాళ‌న ప్రారంభం: చంద్ర‌బాబు

ఈ సంద‌ర్భంగా వైసీపీ పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌త ఐదేళ్ల‌లో తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క్వాలిటీ బాగోలేద‌ని ప‌లుమార్లు భ‌క్తుల నుంచి ఫిర్యాదులు వ‌చ్చినా.. పాల‌కులు ప‌ట్టించు కోలేద‌న్నారు.

By:  Tupaki Desk   |   5 Oct 2024 10:28 AM GMT
తిరుమ‌ల ప్రక్షాళ‌న ప్రారంభం:  చంద్ర‌బాబు
X

తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న ప్రారంభించినట్టు సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. తిరుమ‌లలో సాగుతున్న సాల‌కట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు హాజ‌రైన ముఖ్యమంత్రి శ‌నివారం ఉద‌యం శ్రీవారి ఆల‌యంలో అధికారుల‌తో ఆయ న భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై వారితో చ‌ర్చించారు. అన్న సంత‌ర్ప‌ణ‌, శ్రీవారి ప్ర‌సాదాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. అనంతరం మీడియాలో మాట్లాడిన ఆయ‌న శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో భక్తుల నుంచి తిరుమ‌ల ప్ర‌సాదంపై అభిప్రాయం తీసుకుంటామ‌ని సీఎం తెలిపారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త వంటివి 72 శాతం ఉందని దీనిని 90 శాతానికి తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. జీవ వైవిధ్యానికి(బయో డైవర్సిటీ) తిరుమ‌ల‌లో పెద్ద పీట వేస్తామ‌న్నారు. భ‌క్తుల‌కు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. భక్తల మనోభావాలకు అనుగుణంగా తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం ఉంటుంద‌ని సీఎం తెలిపారు.

వైసీపీ ప‌ట్టించుకోలేదు..

ఈ సంద‌ర్భంగా వైసీపీ పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌త ఐదేళ్ల‌లో తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క్వాలిటీ బాగోలేద‌ని ప‌లుమార్లు భ‌క్తుల నుంచి ఫిర్యాదులు వ‌చ్చినా.. పాల‌కులు ప‌ట్టించు కోలేద‌న్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా తిరుమ‌ల‌ను న‌డిపించార‌ని తెలిపారు. అందుకే ప్ర‌సాదంపై ఎప్పుడూ రాన‌న్ని ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని అన్నారు. కాగా, తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన 'వకుళ‌మాత వంటశాల'ను సీఎం చంద్ర‌బాబు ప్రారంభించారు.

ఈ వంట శాల ద్వారా రోజూ ల‌క్షా 25 వేల మందికి ఏక‌కాలంలో భోజ‌నం వండే అవ‌కాశం ఉంది. 18 వేల మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని(ఉప్మా, పులిహోర‌, పొంగ‌లి వంటివి) త‌యారు చేయొచ్చు. ఇక‌, తిరుమ‌ల‌లో ఇప్ప‌టికే ఉన్న త‌రిగొండ‌ వెంగమాంబ, అక్షయ‌ వంటశాలలకు వకుళమాత వంట శాల తోడు కానుంది. దీంతో రోజుకు ఒక పూట‌లో 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చు.