Begin typing your search above and press return to search.

'అందరికీ ఇళ్లు' ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

మహిళలకు ఆర్థిక భద్రతతోపాటు, సమాజంలో గౌరవం లభించేలా కూటమి ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకువచ్చింది.

By:  Tupaki Desk   |   28 Jan 2025 9:14 AM GMT
అందరికీ ఇళ్లు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
X

ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం మరో భారీ సంక్షేమ పథకానికి పచ్చజెండా ఊపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో పేదలు అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. దీనికోసం విధివిధానాలు ఖరారు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. మహిళల పేరుతో ఏజెన్సీల ద్వారా నిర్మించే ఈ ఇళ్లకు పదేళ్ల తర్వాత పూర్తి హక్కులు బదిలీ చేయనున్నారు.

మహిళలకు ఆర్థిక భద్రతతోపాటు, సమాజంలో గౌరవం లభించేలా కూటమి ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకువచ్చింది. గృహ నిర్మాణ శాఖ ద్వారా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తోంది. అయితే ఇప్పటివరకు స్థలం చూపిన వారి గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం చేసేది. ఈ డబ్బుతోపాటు లబ్ధిదారులు ఇంకొంత అప్పుతెచ్చి ఇళ్లు నిర్మించుకునేవారు. అయితే కొందరు అప్పులు పుట్టక సకాలంలో ఇళ్లు నిర్మించుకోలేక మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ గమనించిన ప్రభుత్వం గృహ నిర్మాణాల్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వమే ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని భావించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవడంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మహిళల పేరిట నిర్మించనున్న ఇళ్లకు ప్రభుత్వమే స్థలం సమకూర్చనుంది. ఇందుకోసం భూ సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఇళ్ల స్థలాలు లేనివారికి ప్రభుత్వమే ఉచితంగా స్థలం కేటాయించనుంది. గ్రామాల్లో అయితే మూడు సెంట్లు, పట్టణాలు, నగరాల్లో రెండు సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏజెన్సీల ద్వారా నిర్మించే ఈ ఇళ్లను రెండేళ్లలోగా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అదేవిధంగా లబ్దిదారులకు పదేళ్ల తర్వాత పూర్తి హక్కులు లభిస్తాయి. అంటే పదేళ్ల తర్వాత లబ్ధిదారులు ఆ ఇళ్లను అమ్ముకోవడమో, ఇతరుల పేరున బదిలీ చేయడమో చేయవచ్చు. ఇక ఒక కుటుంబానికి ఒకేసారి ఇంటి స్థలం కేటాయిస్తారు. డబుల్ ఎంట్రీలు లేకుండా రేషన్ కార్డు, ఆధార్ కార్డు లింకు చేయనున్నారు. అందరికీ ఇళ్లు పేరుతో ప్రారంభిస్తున్న ఈ పథకం కింద 2029 నాటికి సొంత ఇల్లు లేని ప్రజలు లేకుండా చూడాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంగా చెబుతున్నారు. అయితే భారీగా నిధులు అవసరమ్యే ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎలా పూర్తి చేయగలదనేది ఆసక్తికరంగా మారింది.