బాబు ఇంటికి అమిత్ షా.. ఎందుకంటే?
ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నెల 18న ఏపీ పర్యటనకు వస్తున్న అమిత్ షా.. చంద్రబాబు ఇంట్లో విందుకు హాజరుకానున్నారు
By: Tupaki Desk | 16 Jan 2025 12:40 PM GMTఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నెల 18న ఏపీ పర్యటనకు వస్తున్న అమిత్ షా.. చంద్రబాబు ఇంట్లో విందుకు హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న కేంద్ర హోంమంత్రి ప్రత్యేకంగా చంద్రబాబు ఇంటికి వెళ్లనుండటం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.
రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో విందు భేటీ జరపనున్నారు. అమిత్ షా కోసం చంద్రబాబు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ప్రత్యేక వంటకాలను తయారు చేయిస్తున్నారు. తాపేశ్వరం కాజా, బందరు లడ్డూతోపాటు గోదావరి వంటకాలను కేంద్ర హోంమంత్రి కోసం సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అదేవిధంగా శాఖాహార, మాంసాహారాలతో రాగి సంకటిని తయారు చేయిస్తున్నారు.
బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయనేందుకు ఈ భేటీ సంకేతంగా చెబుతున్నారు. అధికారిక పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా ఎన్ఐడీఎం, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ను ప్రారంభించనున్నారు. ఈ నెల 19న జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలకు రాష్ట్రానికి వస్తున్న అమిత్ షాను తమ ఇంటికి రావాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించడంతో ఒక రోజు ముందుగా వచ్చి చంద్రబాబు ఇంట్లో విందు ఆరగించనున్నారు. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలు, మావోయిస్టుల ప్రభావంతోపాటు కూటమి పార్టీల మధ్య రాజకీయ ఎత్తుగడలపై అమిత్ షా చర్చించనున్నారు.