లడ్డూ వ్యవహారం.. జగన్‌పై చంద్రబాబు, పవన్ హాట్ కామెంట్స్
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ప్రస్తావించారు.
By: Tupaki Desk | 22 Sep 2024 7:01 AM GMTతిరుమల తిరుపతి లడ్డూ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లలో చర్చకు దారితీసింది. ఒక విధంగా ఆందోళనకు గురిచేసింది. లడ్డూలో నెయ్యికి బదులు ఏదేదో వాడారంటూ ఆరోపణలు వస్తుండడంతో తిరుమల తిరుపతిని అపవిత్రం చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని అటు చంద్రబాబు ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.
ఇంతటి మహాపాపానికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ప్రజల నుంచి పొలిటికల్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం అయిందని భావించిన చంద్రబాబునాయుడు ఇప్పటికే ఆలయాన్ని సంప్రోక్షణ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయం మొత్తం శుద్ధి చేయాలని ఆదేశించారు. ఇంతటి సున్నితమైన అంశాన్ని లోతుగా విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తాను ఏ పని చేసినా ముందుగా మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటానని చెప్పారు. మార్కెట్లో 600 కిలో అమ్ముడవుతున్న నెయ్యి.. తిరుమలకు కేవలం రూ.320లకే ఎలా ఇవ్వగలిగారని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్‌తో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలోని దేవాలయాలన్నింటిలోనూ తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. దేవుడా క్షమించు.. అంటూ కోరుతూ ఈ రోజు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా సంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. 11 రోజుల పాటు ఈ దీక్ష స్వీకరించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవుడిని దర్శించుకోనున్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ప్రస్తావించారు. వైసీపీ హయాంలో రథాలను సైతం తగలబెట్టారని ఆలయాలను అపవిత్రం చేశారని భగ్గుమన్నారు. రాముడి విగ్రహంలో తల తొలగిస్తే కూడా పోరాడినట్లు చెప్పారు. అయితే.. తమకు ఏ మతము అయినా ఒకటేనని.. ఎవరికి అన్యాయం జరిగినా పోరాడుతామని చెప్పుకొచ్చారు.
తిరుమల ప్రసాదాన్ని భక్తులంతా మహాప్రసాదంగా భావిస్తారని, ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా అని పవన్ మండిపడ్డారు. గతంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో రూ.10వేలు చందాలు తీసుకొని రూ.500 రశీదులు ఇచ్చారని ఆరోపించారు. ఇదంతా జరుగుతుంటే సుబ్బారెడ్డి, వైవీ రెడ్డిలు ఏం చేశారని నిలదీశారు. తప్పు చేసిన వారిని ఓ బాధ్యత గల పౌరుడిగా జగన్ ఎలా సమర్ధిస్తారు అని ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగులకు ఇవన్ని తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు. దోషులు ఎవరైనా వదిలేది లేదు. ఎంతటి వారికైనా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని మతాల వారిని ఒకరినొకరం పరస్పరం గౌరవించుకోవాలని, ఏ మతాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించవద్దని కోరారు. హిందువులు సైతం మతాన్ని గౌరవించాలని, తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవద్దని సూచించారు. అలాగే.. దీనిపై అసెంబ్లీలోనూ చర్చ జరగాలని, దోషులకు కఠిన శిక్ష పడాల్సిందేనని అన్నారు. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చూసుకుంటారని చెప్పారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కేబినెట్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.