Begin typing your search above and press return to search.

నో ఎక్స్ క్యూజ్... తిరుపతిలో అధికారులపై చంద్రబాబు ఫైర్!

ఈ సమయంలో.. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు నేరుగా పరిశీలించారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 10:11 AM GMT
నో ఎక్స్ క్యూజ్... తిరుపతిలో అధికారులపై చంద్రబాబు ఫైర్!
X

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెనువిషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు.. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవును... తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో క్షగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో.. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు నేరుగా పరిశీలించారు.

ఈ క్రమంలో.. ముందుగా బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరుపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని సూచించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై చంద్రబాబు మీడియా ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా... భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? భక్తుల రద్దీ చూసి టిక్కెట్లు ఇవ్వాలని తెలియదా? అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో... భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఏం చేశారు? జేఇవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా? అని టీటీడీ జేఈవో గౌతమిని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలని.. తమాషా అనుకోవద్దని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమయంలో చంద్రబాబు వెంట మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు.

కాగా... తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.