మహిళలకు చంద్రబాబు కానుకలు.. రేపే ముహూర్తం!
దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా మహిళలకు ఉపాధి లభించనుంది. దీనిని కరువు పీడిత కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా అమలు చేయాలని నిర్ణయించారు.
By: Tupaki Desk | 7 March 2025 4:03 PM ISTఏపీ సీఎం చంద్రబాబు మహిళలకు వరాలు ప్రకటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కానుకలను ప్రకటించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా మహిళలకు 250 కోట్ల రూపాయలతో చేపట్టిన కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమానికి శనివారం సీఎం శ్రీకారం చుట్టనున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా మహిళలకు ఉపాధి లభించనుంది. దీనిని కరువు పీడిత కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ శిక్షణ పొందిన వారికి తొలి ఆరు మాసాలు ప్రభుత్వమే పని కల్పించనుంది. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫాం కుట్టడంతోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైన పనులను కూడా వారికే అప్పగించేలా.. ప్రణాళిక సిద్ధం చేసినట్టు సీఎంవో తెలిపింది. అదేవిధంగా చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల్లో మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమానికి కూడా సీఎం చంద్రబాబు రిబ్బన్ కటింగ్ చేయనున్నారు. తద్వారా.. మహిళలను పారిశ్రామికంగా ప్రోత్సహించనున్నారు.
అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే ఆయాలు, సిబ్బందికి సంబంధించి కూడా.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నవారు. వారి రిటైర్మెంట్ సమయానికి ఇచ్చే గ్రాట్యుటీని పెంచారు. ఇప్పటి వరకు కేవలం 10-50 వేల లోపు మాత్రమే ఉన్న వారి గ్రాట్యుటీని సర్వీసు ఆధారంగా 25 శాతం చొప్పున పెంచనున్నారు. గరిష్టంగా 2-3 లక్షలు, కనిష్టంగా లక్ష రూపాయలు వచ్చేలా నిర్ణయించారు.
ఇక, ఆయాల విషయానికి వీరికి 10-20 వేల లోపుగా ఉన్న గ్రాట్యుటీని 50 వేల వరకు పెంచారు. దీనికి కూడా మహిళా దినోత్సవం రోజే శ్రీకారం చుట్టనున్నారు. ఆయా కార్యక్రమాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న చంద్రబాబు ప్రారంభించనున్నారు.