ఇద్దరు ఇన్.. ఇద్దరు అవుట్.... డేట్ ఫిక్స్ చేసిన బాబు ?
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుచేర్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధపడుతున్నారు.
By: Tupaki Desk | 27 Dec 2024 1:26 PM GMTరాష్ట్ర మంత్రివర్గంలో మార్పుచేర్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. దానికి సంబంధించిన కసరత్తు తెర వెనక ఆయన పూర్తి స్థాయిలో చేస్తున్నారు అని అంటున్నారు. ఇక మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తప్పించాలి అన్నది కూడా ఆయన వద్ద ఖచ్చితమైన అంచనా ఉందని అంటున్నారు.
ఈ నేపధ్యంలో మంత్రివర్గంలో ఇద్దరిని కొత్తగా తీసుకుంటారని అంటున్నారు. అదే సమయంలో మరో ఇద్దరిని మాజీలుగా చేసే ప్రక్రియ ఉందని అంటున్నారు. ఇక మంత్రివర్గంలో చేరే వారిలో మొదటి పేరు మెగా బ్రదర్ నాగబాబుదే అని అంటున్నారు.
ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటున్నట్లుగా చంద్రబాబు పదిహేను రోజుల క్రితమే ప్రకటించారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఒకే ఒక బెర్త్ ఖాళీగా ఉంది. దానిని భర్తీ చేయడంతో సరిపెడతారు అని మొదట్లో అనుకున్నారు. కానీ బాబు కేవలం జనసేన నుంచి నాగబాబుకు మాత్రమే కాకుండా టీడీపీ నుంచి కూడా ఒకరికి చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు.
బలమైఇన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాస్ కి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని అంటున్నారు. ఆయన ఏపీలోనే అత్యధిక మెజారిటీ అంటే 94 వేల పై చిలుకుతో గెలిచి వచ్చారు. పైగా టీడీపీ ప్రెసిడెంట్ గా ఆయన తన సత్తా చూపి రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయించారు
దానికి బహుమతిగా ఆయనకు మంత్రివర్గంలో చోటు ఇస్తున్నారు. ఇలా నాగబాబు పల్లా శ్రీనివాసరావులు కొత్త మంత్రులు అవుతారు అని అంటున్నారు. అదే సమయంలో ప్రస్తుత మంత్రివర్గం నుంచి ఇద్దరికి ఉద్వాసన తప్పదని కూడా ప్రచారం సాగుతోంది.
ఆ ఇద్దరూ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కం మంత్రి వాసంశెట్టి శుభాష్, అలాగే విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే కం మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ అని అంటున్నారు.
ఈ విధంగా అయితే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ ఇద్దరి మంత్రులు ఆరు నెలల మంత్రిత్వంలో బాబు అంచనాలకు తగినట్లుగా పనితీరుని కనబరచలేక పోయారు అని అంటున్నారు. మామూలుగా అయితే ఏడాది కాలం దాకా మంత్రులను తప్పించకూడదు అని అనుకున్నారు. కానీ ఈసారి మంత్రులలో జూనియర్లు అధికంగా ఉండడంతో పాటు పనితీరులో కూడా కొందరు వెనకబడినట్లుగా అంచనాలు ఉండడంతో ఒకరిద్దరి విషయంలో యాక్షన్ కి దిగితే మొత్తం మీద అంతా సర్దుకుంటారు అని ఆలోచిస్తూ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు
మరో వైపు చూస్తే మంత్రివర్గం పనితీరు మీదనే సర్కార్ మీద పాజిటివ్ ఒపీనియన్ జనంలో ఏర్పడుతుంది అని అంటున్నారు. ఆ విధంగా కనుక సక్రమంగా ఎవరైనా వ్యవహరించకపోతే ప్రభుత్వానికి అది ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. అందుకే తక్కువ టైం అయినా కూడా ఇద్దరి విషయంలో సీరియస్ యాక్షన్ దిశగా కూటమి పెద్దలు నిర్ణయించారు అని అంటున్నారు
ఇక కొత్త ఏడాది 2025 వస్తూనే జనవరి 8న మంత్రివర్గంలో మార్పు చేర్పులకు ముహూర్తంగా నిర్ణయించారు అని అంటున్నారు. ఆ రోజున కాబోయే మంత్రులకు ముందే సంక్రాంతి వస్తుందని అంటున్నారు. మరి తీసివేసే వారికి మాత్రం పండుగ ముందే భారీ దెబ్బ తగులుతుందని అంటున్నారు. ఏది ఏమైనా మంత్రి వర్గంలో పనిమంతులకే చోటు అన్నది బాబు స్పష్టం చేయదలచారు అని అంటున్నారు. ఇక జనవరి 8న ముహూర్తం అని ప్రచారం బయటకు రావడంతో మొత్తం మంత్రులు అంతా టెన్షన్ పడుతున్నారు. ఎవరికి ఇబ్బంది వస్తుంది అన్నది కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉంది అంటున్నారు.