Begin typing your search above and press return to search.

డ్రోన్ల‌తోనే ఫ్యూచ‌ర్‌.. కీల‌క పాల‌సీకి చంద్ర‌బాబు ఓకే!

తాజాగా ఈ క్ర‌మంలో డ్రోన్ల పాల‌సీని కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. కొన్ని రోజుల కింద‌ట విజ‌య‌వాడ‌, మంగ‌ళ‌గిరిలో అంత‌ర్జాతీయ‌స్థాయి డ్రోన్ల స‌ద‌స్సును కూడా నిర్వ‌హించారు.

By:  Tupaki Desk   |   6 Nov 2024 7:30 PM GMT
డ్రోన్ల‌తోనే ఫ్యూచ‌ర్‌.. కీల‌క పాల‌సీకి చంద్ర‌బాబు ఓకే!
X

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకుని వేస్తున్న అడుగుల గురించి తెలిసిందే. తాజాగా ఈ క్ర‌మంలో డ్రోన్ల పాల‌సీని కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. కొన్ని రోజుల కింద‌ట విజ‌య‌వాడ‌, మంగ‌ళ‌గిరిలో అంత‌ర్జాతీయ‌స్థాయి డ్రోన్ల స‌ద‌స్సును కూడా నిర్వ‌హించారు. త‌ద్వారా డ్రోన్ల పాల‌సీని ఎంత ప్ర‌ధానంగా తీసుకున్నార‌నే విష‌యాన్ని స‌ర్కారు దేశానికి, రాష్ట్రానికి కూడా చాటి చెప్పింది. రానున్న భ‌విష్య‌త్తు మొత్తం కూడా.. డ్రోన్ల‌తోనే ముడి ప‌డి ఉంటుంద‌ని.. దీనిలో ఉపాధి, విద్య అవ‌కాశాలు కూడా మెండుగా ఉన్నాయ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. దీంతో ఈ పాల‌సీని ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇక‌, ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ స‌మావేశంలోనూ.. చంద్ర‌బాబు ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. డ్రోన్ల పాల‌సీని ప‌రుగులు పెట్టించా లని నిర్ణ‌యించారు. దీనిలో భాగంగా ''ఏపీ డ్రోన్ పాలసీ''కి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను రూపొందించారు. దీనికి సంబంధించి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాలను క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. రానున్న రెండేళ్ల‌లోనే 30 వేల మందికి ఉపాధి క‌ల్పించాల‌ని కేబినెట్ తీర్మానించింది. దీనిలో భాగంగా.. డ్వాక్రా మ‌హిళ‌ల‌కుప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. వారికి రుణాల‌పై డ్రోన్ల‌ను కూడా అందించ‌నున్నారు.

ఇక‌, ప్ర‌భుత్వం ప‌రంగా డ్రోన్ పాల‌సీతో ఏటా రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. అలానే.. ఏపీని ప్ర‌పంచ స్థా యి డ్రోన్ వ్య‌వ‌స్థ‌కు, ఉపాది, ఉద్యోగాలు, క‌ల్ప‌న‌కు.. గ‌మ్య‌స్థానంగా మార్చ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే క‌ర్నూలు జిల్లా ఓర్వ‌కల్లు ను 'డ్రోన్ హ‌బ్‌'గా తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యించారు. ఇక్క‌డ 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఏర్పాటు చేయ‌నున్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర‌, జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో విద్యార్థుల‌కు సుమారు ఏటా 25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాల ఏర్పాటుకు కూడా మంత్రి వ‌ర్గం తీర్మానం చేసింది. త‌ద్వారా.. డ్రోన్ల హ‌బ్‌కు మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని భావిస్తోంది. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు చేయ‌నున్నారు. వీటిని జిల్లాకు రెండు చొప్పున ఏర్పాటు చేయ‌నున్నారు. వీటిలోనే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చేలా ఏర్పాటు చేస్తారు. అలాగే.. యూనివ‌ర్సిటీల స్థాయిలో డ్రోన్ రంగంలో ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టే విద్యా సంస్థ‌ల‌కు రూ.20 ల‌క్ష‌ల ప్రోత్సాహం అందించాల‌ని కూడా చంద్ర‌బాబు నేతృత్వంలోని కేబినెట్ నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.