సంతకాలతో పెట్టుబడులు వస్తాయా బాబూ ?
ఏపీలో లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. దీని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 11 Jan 2025 3:00 AM GMTఏపీలో లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. దీని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మామూలుగా అయితే ఒక ఒప్పందం కుదిరిన తరువాత అది గ్రౌండింగ్ అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. అపుడే ఆ ఫలితాలు ఫలాలు వచ్చాయని చెప్పుకోవాల్సి ఉంటుంది.
అయితే ఒక సంస్థతో ఒప్పందం కుదరగానే సంతకాల తడి ఆరకముందే ఏపీకి వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని మొత్తం లక్షల కోట్లతో ఏపీ సుభిక్షంగా ఉందని చెప్పుకోవడం జరుగుతోంది. దీని వల్ల అతి ప్రచారం జరిగి అసలుకే ఎసరు వస్తుందా అన్న చర్చ ఉంది.
ఎందుకంటే ఈ రోజుకీ కఠిన వాస్తవం ఏంటి అంటే ఏపీకి రాజధాని లేదు అన్నది, రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రపంచ బ్యాంక్ రుణంగా తెచ్చుకుంటున్న నేపథ్యం ఉంది. లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ అని చెప్పుకుంటున్నా ఒక పదిహేను వేల కోట్లు నేరుగా రాజధానిలో మౌలిక వసతుల కోసం కేటాయించుకోలేని పరిస్థితులు ఉన్నాయి.
ఇక ఏపీలో అప్పు చూస్తే కొండలా పెరిగిపోతోంది. ఈ విధంగా ఉంటే ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు అని ప్రచారం చేసుకోవడం వల్ల ప్రజలలో లేని పోని ఆశలు కల్పించి అవి కాస్తా వేళ్ళూనుకుని వట వృక్షాలు అయ్యాక ఉపాధి ఇంకా రాలేదని వారే వగచి వాపోయి చివరికి అదంతా వ్యతిరేకతగా మారితే అపుడు బూమరాంగ్ అవుతుంది కదా అన్న చర్చ కూడా ఉంది.
ఇదిలా ఉంటే ఏపీకి సంబంధించిన పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆరు నెలల కాలంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని ఆయన లెక్క వేసి మరీ చెబుతున్నారు.
గతంలో ముప్పయ్యేళ్ళ క్రితం ఏమీ కాని స్థితి నుంచి హైదరాబాద్ ని అభివృద్ధి చేశామని చెపుకొచ్చారు. ఏపీని కూడా ఆ విధంగానే అభివృద్ధి చేస్తామని కుదేలు అయిన నిర్మాణ రంగాన్ని బలోపేతం చేస్తామని బాబు అంటున్నారు ఇవన్నీ మంచిదే కానీ లక్షల కోట్ల పెట్టుబడుల విషయంలోనే అంతా చర్చిస్తున్నారు.
తెలుగుదేశానికి చంద్రబాబుకు అధికారం అయితే కొత్త కాదు 2014 నుంచి 2019 మధ్యలో కూడా ఆనాడు సీఎం గా ఉన్న చంద్రబాబు ఇదే తీరున లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు 2019 నుంచి 2024 మధ్యలో జగన్ సైతం అనేక లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని చెప్పారు.
ఇలా ఏపీ విడిపోయాక ఇద్దరు సీఎంలు పెట్టుబడుల మీద అదే పనిగా ఊదరగొట్టారని కూడా అంటున్నారు. విషయం ఏంటి అంటే ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉంది అని అంతా అంటున్నారు. ఏపీ ఈ రోజు మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు వెతుక్కోవాల్సి వస్తోంది. అమరావతి రాజధాని విషయమే తీసుకుంటే అప్పులో కోసం చూస్తున్న నేపథ్యం ఉందని అంటున్నారు.
మరి కేవలం పదిహేను వేల కోట్ల రూపాయల చిన్న మొత్తాన్నే ఏపీ సమకూర్చుకోలేక అవస్థలు పడుతున్న వేళ ఈ లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి పోయాయని ప్రజలు అనుకుంటున్నారు. అభివృద్ధి అన్నది కనిపించాలి కదా అని అంటున్నారు. నిజంగా పెట్టుబడులు లక్షలలో వచ్చినట్లు అయితే గ్రౌండింగ్ అయిన పరిశ్రమలు ఎన్ని అని కూడా జనాలలో ఉన్న సందేహంగా ఉంది. ఒక పరిశ్రమ స్థాపనకు ఎంత సమయం పడుతుంది అన్నది ఇప్పటి ప్రజలకు అవగాహన ఉందని అంటున్నారు.
ఇక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే ఏపీ దేశంలో సంపన్న రాష్ట్రంగా మారుతుందని అంటున్నారు. సంతకాలు చేస్తే పరిశ్రమలు వచ్చినట్లు కాదని అంటున్నారు. అవి క్షేత్ర స్థాయిలోకి వచ్చినపుడే ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ఆ దిశగా ప్రజలలో కూడా చైతన్యం ఉందని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ కూటమి ఒప్పందాలు కుదుర్చుకున్న అన్ని ప్రాజెక్టులు అమలులోకి రావాలని ఏపీ అగ్ర స్థానంలో ఉండాలని అంతా కోరుకుంటున్నారు.