మంత్రుల గుండెల్లో గుబులు.. క్లాస్‌కు రెడీ.. !
సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ కేబినెట్ సమావేశం గురువారం(ఈరోజు) జరగనుంది. ఈ సందర్భం గా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
By: Tupaki Desk | 19 Dec 2024 7:13 AM GMTసీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ కేబినెట్ సమావేశం గురువారం(ఈరోజు) జరగనుంది. ఈ సందర్భం గా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాజధాని అమరావతిలో చేపట్టనున్న పలు పనులకు సంబం ధించి 24 వేల కోట్ల రూపాయల పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా పలు పరిశ్రమల కు భూముల కేటాయింపు అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బుడమేరు ముంపు బాధితుల రుణాలను రీషెడ్యూల్ చేసేలా కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అదేవిధంగా బుడమేరు బాధితులకు స్టాంపు డ్యూటీ మినహాయింపును ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రి వర్గం పచ్చజెండా ఊపనుంది. మరోవైపు, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు పూర్తయిన నేపథ్యంలో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఇదే ఇప్పుడు అసలు కీలక వ్యవహారంగా మారింది. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి.. ఆరు మాసాలు పూర్తయిన నేపథ్యంలో మంత్రుల ప్రొగ్రెస్‌పై ఈ రోజు చంద్రబాబు సంచలన ప్రకటన చేయనున్నారు.
దీంతో ఎవరికి వారు మంత్రులు తమ తమ ప్రోగ్రెస్ రిపోర్టులపై ఆసక్తిగా ఉన్నారు. ఇదేసమయంలో కొందరు మంత్రులు.. తమకు క్లాసు తప్పదన్న భావనలోనూ ఉన్నారు. వీరిలో మంత్రులు కొలుసు పార్థసారథి, సుభాష్, మహిళా మంత్రి సవిత తదితరులు ఉన్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నేత జోగి రమేష్‌తో భుజం భుజం రాసుకుని కార్యక్రమంలో పాల్గొన్న వ్యవహారం రాజకీయంగా రచ్చకు దారి తీసింది. దీనిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయినా.. మంత్రితో ముఖాముఖి మాట్లాడలేదు.
ఇక, మంత్రి సుభాష్ వ్యవహారంపై సొంత పార్టీ నాయకులే ఫిర్యాదులు చేస్తున్నారు. ఒంటెత్తు పోకడలకు పోతున్నారని.. ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికి రెండు సార్లు సుభాష్‌కు హెచ్చరికలుచేశారు. అయినా.. ఆయన పరిస్థితిలో మార్పు రాలేదు. ఇక, తాజాగా మంత్రి సవి త సొంత నియోజకవర్గంలో టీడీపీ నేతల నుంచి నిరసనను ఎదుర్కొంటున్నారు. దీనికి ఆమె దూకుడు కారణమనే వాదన ఉంది. ఈ క్రమంలో వీరికి కూడా చంద్రబాబు క్లాసు తప్పదన్న సంకేతాలు వస్తున్నా యి. మొత్తానికి వీరంతా కూడా.. సీఎం క్లాస్‌కు రెడీ అవుతున్నారని టీడీపీ నేతలు చెబుతుండడం గమనార్హం.