Begin typing your search above and press return to search.

ఆ ‘అరెస్టు’కు ఏడాది.. తెలుగు రాజకీయాలను మలుపుతిప్పిన రోజు

చంద్రబాబు అరెస్టు ఘటన ఏపీలో రాజకీయ పునరేకీకరణకు దారితీసిందనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   9 Sep 2024 6:09 AM GMT
ఆ ‘అరెస్టు’కు ఏడాది.. తెలుగు రాజకీయాలను మలుపుతిప్పిన రోజు
X

2023 సెప్టెంబరు 8.. సరిగ్గా ఏడాది కిందట.. అప్పటికి ఆయన ప్రతిపక్ష నేత.. 70 ఏళ్లు దాటిన వయసు.. మళ్లీ గెలుస్తారో లేదో తెలియదు.. మరోవైపు అధికార పార్టీ దూకుడు చూపుతోంది.. ఇదే చివరి ప్రయత్నం అన్నట్టు.. ఆయన అలుపెరగకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. అటునుంచి స్పందన కూడా అంతే ఉంది.. ఇలాంటి సమయంలో విజయం ఎవరిదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.. అలాంటి సమయంలోనే జరిగిందీ ఘటన.. అక్కడ ఏం జరిగిందన్నది కాదు.. అసలాయన తప్పు చేశారా? లేదా? అన్నది చూడలేదు. ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం మొదలైంది. అదే.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మార్చేసింది..

‘నైపుణ్యాభివృద్ధి’ కేసుదే ఆ పుణ్యం..

నిరుడు ఇదే రోజున టీడీపీ అధినేత, అప్పటికి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును ఏపీ సీఐడీ ద్వారా నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అరెస్టు చేసింది నాటి వైసీపీ ప్రభుత్వం. అనంతరం రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. సరిగ్గా అప్పటికి 45 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న చంద్రబాబును ఈ ఘటన వ్యక్తిగతంగా ఎంతగానో వేధించింది. వైసీపీ అధినేత, ఏపీ అప్పటి సీఎం వైఎస్ జగన్ కొట్టిన దెబ్బలకు బాగా కసిగా ఉన్న టీడీపీ శ్రేణులు మరింత సంఘటితం అయ్యాయి. వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగాయి.

నాడు నంద్యాల నుంచి..

‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరిట చంద్రబాబు నిరుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే రోజున నంద్యాలలో సభలో పాల్గొన్నారు. రాత్రి బస్సులో బస చేశారు. అయితే, తెల్లవారుజామున ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అరెస్టు చేశారు. వందలమంది పోలీసులు చుట్టుముట్టి.. తెల్లవారుజామున 5.30 సమయంలో బస్సు అద్దాలపై బాదుతూ చంద్రబాబును నిద్ర లేపారు. ఉదయం 6 గంటల సమయంలో అరెస్టు చేసి రోడ్డు మార్గంలో విజయవాడ సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ తో రాజమహేంద్రవరం జైలుకు తీసుకెళ్లారు.

కలిసొచ్చిన జనసేన.. కలవక తప్పని బీజేపీ..

చంద్రబాబు అరెస్టు ఘటన ఏపీలో రాజకీయ పునరేకీకరణకు దారితీసిందనే చెప్పాలి. అప్పటివరకు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందనే అంచనాలు మాత్రమే ఉన్నాయి. అవి ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వం అంటూ చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు అరెస్టు సంగతి తెలిసి హైదరాబాద్ నుంచి తిరిగొచ్చేందుకు ప్రయత్నించారు. ఏపీ సరిహద్దులో ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నింద్రించారు. అనంతరం బాలక్రిష్ణ, లోకేశ్ తో కలిసి రాజమహేంద్రవరం జైలుకి వెళ్లిన పవన్.. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.

జగన్ చేసిన అతిపెద్ద తప్పు..

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల ప్రకారం.. జగన్ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు అరెస్టు. బాబును జైలుకు పంపిన రోజునే తాను ప్రెస్ మీట్ లో ఇదే మాట చెప్పానని ఆయన అంటుంటారు. చంద్రబాబు జైలుకెళ్లడంతోనే పవన్ కల్యాణ్ రావడం, మద్దతు, పొత్తు ప్రకటించడం, బీజేపీకీ పొత్తు పెట్టుకోక తప్పకపోవడం జరిగాయంటారు. వాస్తవానికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును జైలుకు పంపేంత అభియోగాలు లేవని.. మనీ ట్రయల్ లో ఆయన వరకు డబ్బు వచ్చిందనే సాక్ష్యాలు లేవని అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాజకీయాలూ మలుపు తిప్పింది

తెలంగాణలో నిరుడు నవంబరు 30న ఎన్నికలు జరిగాయి. అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం తాము 100 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది. కానీ, చంద్రబాబు అరెస్టు ఇక్కడివారిపైనా తీవ్ర ప్రభావం చూపింది. మరీ ముఖ్యంగా టీడీపీని అభిమానించే వర్గాల్లో. ఇదే సమయంలో చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించడాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఇది కూడా కొంత ప్రభావం చూపింది. చివరకు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దెబ్బపడింది. ఇక చంద్రబాబు అరెస్టుతో తెలుగు రాష్ట్రల్లో ఆందోళనలు పెద్దఎత్తున జరిగాయి. నంద్యాల నుంచి ఆయనను విజయవాడ తీసుకొస్తుండగా టీడీపీ క్యాడర్ పలుచోట్ల అడ్డుకుంది. మహిళలు సైతం వీధుల్లోకి వచ్చారు. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఉద్యమించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుపడినా.. రాజమహేంద్రవరం వరకు వచ్చి సంఘీభావం తెలిపారు. కర్ణాటక, తమిళనాడులూ సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా, యూకే సహా సుమారు 70 దేశాల్లో ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రజలు ర్యాలీలు చేపట్టారు

53 రోజుల తర్వాత విడుదల..

2023 సెప్టెంబరు 8న అరెస్టైన చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారు. నిరుడు అక్టోబరు 31వ తేదీన మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు. చంద్రబాబు జీవితంలో బాబ్లీ కేసులో మినహా ఏనాడూ అరెస్టు కాలేదు. జైలు జీవితం చూడలేదు. ఆయన జైలు నుంచి విడుదలయ్యాక విజయవాడ వరకు 200 కి.మీ ప్రయాణానికి సుమారు 13 గంటలు పట్టింది.