మహారాష్ట్రలో బీజేపీ గెలుపు.. చంద్రబాబుకు మరింత బలం..!
ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఏపీకి కూడా కలిసి వస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 23 Nov 2024 5:30 PM GMTకొన్ని కొన్ని విషయాలకు కార్యాకారణ సంబంధాలు ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు ఏపీలోనూ జరుగు తోంది. ఎక్కడో ఉన్న మహారాష్ట్రలో బీజేపీ విజయం దక్కించుకుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు 190 స్థానాల్లో కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ కూటమి(మహాయుతి) ముందజలో ఉంది. అంటే ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఏపీకి కూడా కలిసి వస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.
అదేలా..?
ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వం లోని కూటమి బలపడుతోంది. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగతంగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రభావం ఏపీ వంటి రాష్ట్రాలపై సానుకూల ప్రభావం చూపుతుందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వానికి బీజేపీ విజయం దోహదపడుతుందని చెబుతున్నారు. ఏపీలో కూటమిగా ఉన్న బీజేపీకి మరింత సత్తువ పెరుగుతుందని అంటున్నారు.
ఇది అంతిమంగా .. చంద్రబాబు ప్రభుత్వానికి రక్షణ కవచంగా మారే అవకాశం ఉంది. బలపడుతున్న బీజేపీతో సఖ్యతగా ఉన్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకునేందుకు సౌలభ్యం ఏర్పడుతుంది. అలా కాకుండా.. మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రంలో బీజేపీ ప్రభావం సన్నగిల్లి ఉంటే.. ఆ ప్రభావం కూడా చంద్రబాబుపై పడేది. కానీ, ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ పుంజుకోవడం.. ఏకపక్షంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం భారీ మెజారిటీ దక్కించుకోవడం వంటివి చంద్రబాబుకు కలిసి వచ్చే పరిణామాలుగా చెబుతున్నారు.
నిజానికి మహారాష్ట్రతో ఏపీకి ఎలాంటి సంబంధాలు లేవు. నీటి వివాదాలు కూడా తెలంగాణకే పరిమితం. అయినా.. రాజకీయంగా చూసుకున్నప్పుడు బీజేపీ బలోపేతం కావడం అనేది చంద్రబాబు కలిసి వస్తున్న అంశం. బీజేపీ బల పడడం ద్వారా .. ఆ పార్టీతో మరిన్ని సంవత్సరాలు కలిసి ముందుకు సాగేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. ఇదిఏ పీలోనూ ఆయనను బలోపేతం చేస్తుంది. కాబట్టి మహారాష్ట్రలో బీజేపీ విజయం చంద్రబాబుకు మరింత శక్తినిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.