మంత్రివర్గంలో చోటు కోసం.. విజయవాడ ఎమ్మెల్యే కుస్తీ.. !
అంతేకాదు.. తన వారిని పెట్టుకుని.. మంత్రివర్గం పై ఎప్పుడు ఎలాంటి సమాచారం బయటకు వచ్చినా.. వెంటనే తనకు తెచ్చేలా కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది
By: Tupaki Desk | 23 Feb 2025 8:30 AM GMTచంద్రబాబు మంత్రివర్గ విస్తరణ వచ్చే ఉగాది నాటికి ఉంటుందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా సాగుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో జనసేన నాయకుడు.. నాగబాబు కు అవకాశం ఇస్తారని తెలిసిందే. అయితే.. ఆయనతోపాటు.. ఒకటి రెండు స్థానాలను కూడా మార్పు చేసే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. అయితే.. ప్రస్తుతం ఇతర సమస్యలు పెరిగిపోవడంతో కొంత మందగమనంలో సాగుతున్నాయి.
కానీ.. మంత్రులను మార్చడం మాత్రం ఖాయమన్నది పార్టీ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ. ఈ క్రమం లో నాగబాబుతోపాటు.. మరో ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకుంటే.. ఆ ఇద్దరిలో తన పేరు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు విజయవాడ కు చెందిన ఓ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే. నిత్యం సీఎంవోలోనే ఆయన తిష్ఠ వేస్తున్నారట. అంతేకాదు.. తన వారిని పెట్టుకుని.. మంత్రివర్గం పై ఎప్పుడు ఎలాంటి సమాచారం బయటకు వచ్చినా.. వెంటనే తనకు తెచ్చేలా కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది.
పార్టీ కోసం.. అనేక ఇబ్బందులు పడ్డానని.. కీలక సామాజిక వర్గంలో తనను ఎంపిక చేయడం ద్వారా పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని.. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వద్ద కూడా.. సదరు ఎమ్మెల్యే చెప్పినట్టు తెలిసింది. అంతేకాదు.. మీడియా మిత్రులను కూడా కాకాపడుతున్నారట. తనకు అనుకూలంగా కథనాలు రాయాలని.. కోరుతున్నట్టు మీడియాలోనూ చర్చ సాగుతోంది. గతంలో అసెంబ్లీలో కొడాలి నానిని వేలు పెట్టి హెచ్చరించిన.. ఈ ఎమ్మెల్యే.. పార్టీలోనూ ఫైర్‌బ్రాండ్‌గానే ఉన్నారు.
అయితే.. ఈయనకు మంత్రివర్గంలో చోటు ఇస్తే.. చంద్రబాబు రోజూ మీడియా ముందుకు వచ్చి వివరణ లు ఇవ్వాల్సి ఉంటుందని.. ఇలాంటి వారికి ఇవ్వరాదని మరికొందరు చెబుతున్నారు. ''ఇలాంటి వారికి ఎందుకు? '' అని ఓ మాజీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. ఈయన ఎప్పుడు ఏ గొడుగు పడతారో తెలియదని కూడా అంటున్నారు. తన వ్యాపారాలు పెంచుకునేందుకు మంత్రిగా చోటు కోసం ప్రయత్నిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలుకూడా పార్టీలో వినిపిస్తున్నాయి. చిత్రం ఏంటంటే.. నారా లోకేష్ దగ్గర జీరో మార్కులు ఉన్న ఈ ఎమ్మెల్యేకు చంద్రబాబు దగ్గర మంచి మార్కులు ఉండడం. మరి ఏం జరుగుతుందో చూడాలి.