లిక్కర్‌లో మంత్రులూ వేలు పెట్టారా... చంద్రబాబు ఆరా...?
దీని ప్రకారం.. మద్యం వ్యాపారాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం రెడీ చేసింది.
By: Tupaki Desk | 11 Oct 2024 11:13 AM GMTరాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అంటే.. వైసీపీ హయాంలో వైన్స్ షాపులను ప్రభుత్వమే నిర్వహించింది. కానీ, దీనివల్ల.. అక్రమాలు చోటు చేసుకుం టున్నాయని చీపు లిక్కర్ విక్రయాలు పెరిగిపోయాయని చెబుతున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం 2014-19 మధ్య రాష్ట్రంలో అమలైన విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం.. మద్యం వ్యాపారాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం రెడీ చేసింది.
దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను కూడా ప్రారంభించింది. తొలిసారి తీసుకున్న నిర్ణయం ప్రకారం.. బుధవారం(అక్టోబరు 9)తో దరఖాస్తులకు గడువు తీరింది. కానీ, ఆశించిన మేరకు పోటీ లేదని, దరఖాస్తులు రాలేదని భావించిన ప్రభుత్వం ఈ నెల 12(శనివారం) వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. ఇదిలావుంటే.. అసలు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు ఎందుకు తగ్గాయన్న విషయంపై అనేక విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
టీడీపీ సీనియర్లు.. దీనికి అడ్డుపడుతున్నారని, దరఖాస్తులు వేసేవారిని అడ్డుకుంటున్నారని అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో చంద్రబాబు తాజాగా క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించు కున్నారు. వీటిలో మరిన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయని తెలిసింది. శ్రీకాకుళం, నెల్లూరు, విజయవాడ, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోను, కర్నూలులోనూ.. కీలక మంత్రులే దరఖాస్తుల ప్రక్రియలో వేలు పెట్టారని చంద్రబాబుకు తెలిసింది. ఆ వెంటనే ఒకరిద్దరు మంత్రులతోనూ ఆయన సంప్రదించారు.
నెల్లూరులో మంత్రి నారాయణ కారణంగానే దరఖాస్తులు తగ్గాయని సీనియర్ నాయకులు కూడా ఆరోపిం చారు. దీంతో ఆయన నేరుగా వివరణ ఇచ్చారు. నిజమే.. మా వారిని నేను ప్రోత్సహించాను తప్పేంటి? అని ప్రశ్నించారు. కర్నూలుకు చెందిన ఓ మంత్రి కూడా ఇదే సమాధానం చెప్పారు. కానీ, ఇక్కడ విషయం ప్రోత్సహించడం గురించికాదు. రంగంలోకి దిగుతామని చెప్పిన వారిని అడ్డుకోవడం. దీంతోనే దరఖాస్తుల సంఖ్య తగ్గిపోయిది. ఫలితంగా దరఖాస్తు ఫీజు రూపంలో రూ.2 లక్షల చొప్పున 2 వేల కోట్లు వస్తుందని ఆశించిన సర్కారుకు.. ఇప్పటి వరకు.. వెయ్యికోట్ల రూపాయలు కూడా మించకపోవడం గమనార్హం. దీంతో మంత్రుల వ్యవహార శైలిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.