అప్పులపైన తప్పులు చెబితే గుంజీలు తీయిస్తా !
అసలు ఏపీ అప్పు ఎన్ని లక్షల కోట్లు ఉందో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అసెంబ్లీకి వినిపించారు.
By: Tupaki Desk | 15 Nov 2024 8:30 PM GMTఅప్పు కూడా రాజకీయ ఆయుధం అవుతుందని ఎవరూ అనుకోరు. అలా అనుకుంటే సుమతీ శతక కారుడు కూడా అప్పిచ్చువాడు వైద్యుడు అని పద్యం రాయడు సరికాదా అప్పు గోల ఎందుకులే అని తప్పుకునేవాడు. అప్పు చేసి పప్పు కూడు అన్న సినిమా కూడా వచ్చేది కాదేమో
ఇంతకీ అప్పు అంత తప్పు మాట. అసలు అప్పు చేయకూడదా అంటే ఎవరన్నారు ఆ మాట అని పెద్దలంతా గద్దించే పరిస్థితి కూడా ఉంటుంది. అసలు మనిషి పుట్టుక పుట్టాక ఎవరు అప్పు చేయకుండా ఉండగలిగారు అని కూడా అంతా అనే సీన్ ఉంటుంది. జీవితంలో ఎవరో ఏదో సందర్భంలో అప్పు కచ్చితంగా చేసిన వారే. ఆఖరుకు కలియుగ దైవం వెంకన్నబాబు కూడా అప్పు చేసి ఈ కలియుగం అంతా కుబేరుడుకి తీరుస్తూనే ఉన్నారు అని కూడా పురాణ గాధలు ఉన్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాల్లో కూడా అప్పు మాట లేకుండా సజావుగా పాలిటిక్స్ గప్ చిప్పుగా సాగిపోయిన కాలం ఉంది. కానీ ఇపుడు కాదేదీ అనర్హం అన్నట్లుగా అప్పులు కూడా సీరియస్ పొలిటికల్ ఇష్యూగా మారుతోంది.
అందుకే అప్పులు చేసే వారు కూడా ఇపుడు అదేదో తప్పులా ఫీల్ అవుతున్నారు. ఇక అప్పులు ఎవరికి లేవు అని మళ్ళీ ఆరా తీస్తే కేంద్రంతో సైతం దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఉన్నాయి. అయితే అప్పు అన్న మాట వింటే ఎందుకో నెగిటివ్ సెన్స్ వస్తుంది. అప్పు ఎవరు చేస్తారు అంటే సంపద సృష్టించలేని వారు చేతగాని వారే అన్న పరమార్ధం అందులో వస్తుంది.
అందుకే అప్పు మీద ఇంతటి హాట్ డిస్కషన్ సాగుతోంది. ఏపీలో చూస్తే ఎన్ని అప్పులు ఉన్నాయన్న దాని మీద ఎవరి వాదన వారికి ఉంది. అప్పు ఆరున్నర లక్షలే అని వైసీపీ అంటూంటే కాదు తొమ్మిదిన్నర లక్షలు అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారు. అయితే ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ లో అప్పును ఆరున్నర లక్షల కోట్లు చూపించారు వైసీపీ నేతలు అంటూంటే అందులో వివిధ కార్పోరేషన్ల ద్వారా చేసిన అప్పుని మినహాయించి చూపించారు అని కూటమి నుంచి విమర్శలు వస్తున్నాయి.
అసలు ఏపీ అప్పు ఎన్ని లక్షల కోట్లు ఉందో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అసెంబ్లీకి వినిపించారు. ఏపీ అప్పు అక్షరాలా 9.74 లక్షల కోట్ల రూపాయలు అని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇందులో సివిల్ సప్లైస్, పవర్ సెక్టార్, కార్పోరేషన్, పబ్లిక్ అకౌంట్స్ వంటి వాటిలో అప్పులు పెద్ద ఎత్తున ఉన్నాయని సభకు బాబు వివరించారు.
అయితే 2023-24 ఆర్ధిక సంవత్సరం పూర్తి అయ్యేనాటికి ఏపీకి ఉన్న అప్పు 6.46 లక్షల కోట్ల రూపాయలు అని పయ్యావుల చెప్పారు. దీని మీద రాద్ధాంతం అయితే సాగుతోంది. బడ్జెట్ మీద మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏపీలో అప్పు 6.46 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పిందని గుర్తు చేశారు. ఇందులో కూడా వైసీపీ మొత్తం చేసింది కాదని 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వంలో చేసిన అప్పు కూడా ఉందని వివరించారు. తమ అయిదేళ్ల పాలనలో చేసిన అప్పు మూడు లక్షల కోట్ల రూపాయలే అని వైసీపీ అంటోంది. వాటిని కూడా సంక్షేమ పథకాల కోసమే తెచ్చామని పైగా రెండేళ్ళ పాటు ఏపీని కరోనా మహమ్మారి ఇబ్బందిపెట్టిందని ఆదాయాలు అన్నింటా పడిపోయిన పరిస్థితి ఆనాడు ఉందని అంటోంది.
అయితే ఏపీలో వివిధ కార్పోరేషన్లు ఇతరత్రా సంస్థలలో కూడా అప్పులు వైసీపీ ప్రభుత్వం చేసిందని అవన్నీ కలిపితే మరో మూడున్నర లక్షల కోట్లు అంటూ చంద్రబాబు అసెంబ్లీలో తాజాగా ప్రకటించారు. మరి దీని మీద వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అయితే అప్పుల మీద ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే గుంజీలు తీయిస్తామని కూడా ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించడం విశేషం. సో అప్పుల మీద హీటెక్కించే డిస్కషన్స్ ఇంకా సాగుతూనే ఉంటాయని అనుకోవాల్సిందే.