గుజరాత్ మోడల్ : .టీడీపీకే మళ్ళీ మళ్ళీ అంటున్న బాబు !
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గుజరాత్ మోడల్ అని అంటున్నారు. ఆయన ఈ విషయం ఇప్పటికి రెండు మూడు సార్లు చెప్పి ఉన్నారు.
By: Tupaki Desk | 28 Jan 2025 3:42 AM GMTటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గుజరాత్ మోడల్ అని అంటున్నారు. ఆయన ఈ విషయం ఇప్పటికి రెండు మూడు సార్లు చెప్పి ఉన్నారు. ఇంతకీ గుజరాత్ మోడల్ అంటే ఏంటి అంటే స్థిరమైన అభివృద్ధి. దానికి కారణం స్థిరమైన రాజకీయం. గుజరాత్ లో చూస్తే మూడు దశాబ్దాలుగా ఒకే ఒక్క పార్టీని ప్రజలు ఎన్నుకుంటూ వస్తున్నారు.
బీజేపీ గుజరాత్ లో 1995 నుంచి వరసగా గెలుస్తోంది. ఆ పార్టీకి ఎన్నికలు ఒక లాంచనంగా మారిపోయాయి. ఎన్నికలు ఎపుడు వచ్చినా గుజరాత్ లో ఎగిరేది కాషాయం జెండానే. గుజరాత్ లో మొదట్లో కేశూభాయ్ పటేల్ అనే పెద్దాయన సీఎం గా చేశారు. ఆయన తరువాత అత్యధిక కాలం అంటే 13 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మోడీ కేంద్రానికి వచ్చిన తరువాత కూడా వరసగా జరిగిన మరో మూడు ఎన్నికలో గుజరాత్ లో బీజేపీ గెలిచింది. దాంతో చంద్రబాబు గుజరాత్ మోడల్ అవసరం అని అంటున్నారు. గుజరాత్ లో అభివృద్ధి బాగా జరుగుతోంది అంటే ప్రజలు ఒకే పార్టీని ఎన్నుకుంటూ వస్తున్నారని దాని వల్ల స్థిరమైన అభివృద్ధి సాధ్యపడుతోందని అన్నారు.
ఏపీలో కూడా 2019లో మరోసారి టీడీపీకి అవకాశం ఇచ్చి ఉన్నట్లు అయితే ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ప్రజలకు తాత్కాలిక పథకాల తాయిలాలు కావాలో గుడ్ గవర్నెన్స్ కావాలో తేల్చుకోవాలని ఆయన కోరారు ప్రజలు అభివృద్ధి పట్ల ఆసక్తిని చూపిస్తే కనుక తప్పకుండా మార్పు వస్తుందని ఆయన అన్నారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే గుజరాత్ తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య ప్రదేశ్ ఇలా దేశంలో కొన్ని రాష్ట్రాలలో వరసగా అనేక పర్యాయాలు ఒకే పార్టీ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చారు.
కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే ఏపీలో మాత్రం రాజకీయం ఎపుడూ మారుతూనే ఉంటుంది. ప్రతీ అయిదేళ్ళకూ ఒక పార్టీని దించేసి మరో పార్టీని ఎక్కించడం ప్రజలు అలవాటుగా చేసుకున్నారు. అయితే ఉమ్మడి ఏపీలో సరైన ఆల్టర్నేషన్ లేకపోవడం వల్ల 1983 దాకా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటూ వచ్చింది.
ఇక చూస్తే 1978లో రెడ్డి కాంగ్రెస్ అలాగే జనతా పార్టీ కాంగ్రెస్ ఐ విడిగా పోటీ చేసాయి. కాంగ్రెస్ ఐ ఎక్కువ సీట్లు తెచ్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ రెడ్డి కాంగ్రెస్ జనతా పార్టీలకు కూడా గణనీయమైన సీట్లు దక్కాయి. ఆ రాజకీయ పరిణామం చూసిన మీదటనే తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
అలా తెలుగుదేశం అధికారం చేపట్టాక రాజకీయం కాస్తా టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. విభజన ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. అయితే చంద్రబాబు చెప్పినట్లుగా ఏకపక్షంగా అనేక సార్లు టీడీపీనే గెలిపించాలన్నది ఏపీ ప్రజలు ఆలోచిస్తారా అన్నది చూడాలి. మరి టీడీపీ పొలిటికల్ ట్రాక్ రికార్డు చూస్తే 1999 తరువాత వరసగా రెండు సార్లు గెలిచినది లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న ఈ ప్రకటనల మీద ఏపీ జనాలు ఆలోచిస్తారా అన్నదే చూడాల్సి ఉంది.