బాబుతో 'బూడిద' రాజకీయం..జేసీ డుమ్మా!
అయితే.. ఈ సమావేశానికి జేసీ డుమ్మా కొట్టడం చంద్రబాబును మరింత ఆగ్రహానికి గురయ్యేలా చేసిందని సమాచారం.
By: Tupaki Desk | 29 Nov 2024 10:30 PM GMTగత వారం రోజులుగా ఉమ్మడి కడప, అనంతపురం జిల్లాల్లో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య చెలరేగిన బూడిద వివాదం ఏపీ సీఎం చంద్రబాబు వద్దకు చేరుకుంది. బీజేపీ నాయకుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య బూడిద రవాణా విషయంలో ఆధిపత్య ధోరణి పెరిగి, ఇది రాజకీయాలకు దారి తీసింది. దీంతో గత వారం రోజులుగా కడప జిల్లాలోని రాయల సీమ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు కూడా రువ్వుకున్నారు.
అంతేకాదు.. ఈ ఫ్లైయాష్ రావాణాను తామే చేసుకుంటామని జేసీ అంటే.. కాదు తామే నని ఆదివర్గం భీష్మించింది. దీంతో ఇరు జిల్లాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి రాజకీయాలపై కూడా ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వద్దకు ఈ విషయం చేరింది. దీంతో ఆయన జేసీ, ఆదినారాయణరెడ్డిలను స్వయంగా అమరావతికి రావాలని పిలు పునిచ్చారు. ఈ సమస్యను తానే పరిష్కరిస్తానని కూడా చెప్పారు. కూటమి నాయకులు సఖ్యతగా ఉండాలని చెబుతుంటే రోడ్డున పడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలు, చంద్రబాబు పిలుపుతో ఆది నారాయణరెడ్డి అమరావతికి వచ్చారు. చంద్రబాబును కలిసి.. ఫ్లైయాష్ వివాదంపై చర్చించారు. స్థానికంగా ఉన్న పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే తాము ఫ్లైయాష్ రవాణా చేస్తున్నట్టు ఆది వివరించారు. దీనికి జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డు పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను నమోదు చేసుకున్న చంద్రబాబు.. స్థానిక రెండు జిల్లాల అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని, అనంతరం ఒక నిర్ణయాన్ని వెలువరుస్తానని చెప్పారు.
రోజుకు 5 లక్షల ఆదాయం!
రాయల సీమ ధర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతుంది. దీనిని ప్లాంటు బయట పారబోస్తుంది. అయితే.. ఈ ప్లాంటుకు వేస్ట్ అయిన ఈ యాష్.. సిమెంటు కంపెనీలకు బంగారంతో సమానం. దీంతో కడపలోని ప్లాంటు నుంచి అనంతపురంలో ఉన్న సిమెంటు ఫ్యాక్టరీలకు దీనిని అధికారంలో ఎవరు ఉంటే వారు(ఎమ్మెల్యేల) రవాణా చేసుకుంటారు. ఇలా రోజుకు 5 లక్షల రూపాయలు సంపాదన వస్తుంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేయగా.. ఇప్పుడు కూటమి పార్టీల నేతలైన జేసీ, ఆదిల మధ్య ఈ రవాణా విషయంలో ఆధిపత్యం ఏర్పడింది. రోజుకు 5 లక్షల ఆదాయం కావడం. అదికూడా.. యాష్ ఉచితంగా వస్తుండడంతో ఇద్దరూ తామంటే తామే రవాణా చేస్తామని వివాదం చేసుకుంటున్నారు.