Begin typing your search above and press return to search.

గుకేశ్ తమిళ తంబినా..తెలుగు బిడ్డా? చంద్రబాబు ట్వీట్ తో మాటల యుద్ధం

గుకేశ్ విజయానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన అభినందన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

By:  Tupaki Desk   |   13 Dec 2024 9:38 AM GMT
గుకేశ్ తమిళ తంబినా..తెలుగు బిడ్డా? చంద్రబాబు ట్వీట్ తో మాటల యుద్ధం
X

మేధో క్రీడ అయిన చెస్ లో ప్రపంచ చాంపియన్ గా నిలవడం అంటే మామూలు మాటలు కాదు.. దశాబ్దాల అనుభవం ఉన్న ఆటగాళ్లకే అది సాధ్యం కాదు.. కానీ, గుకేశ్ దొమ్మరాజు దీనిని 18 ఏళ్ల వయసుకే సాధ్యం చేశాడు.. కోనేరు హంపి, పెంట్యేల హరిక్రిష్ణ, ద్రోణవల్లి హారిక వంటి దిగ్గజాలకు సాధ్యం కాని దానిని టీనేజీలోనే చేసి చూపాడు. అయితే, ఇంతకూ గుకేశ్ తెలుగువాడా? తమిళుడా? అసలు పేరులోనేమో తమిళ వాసన.. ఇంటి పేరులో తెలుగు మూలాలు.. దీంతోనే గుకేశ్ ఎవరు? అనే సందేహం కలుగుతోంది.

తూ.గో. కాదు.. చిత్తూరు

గుకేశ్ కుటుంబానికి తెలుగు మూలాలున్నాయి. అతడి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌. పుత్తూరు సమీపంలోని పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగ వీరి ముత్తాతల నివాసం. కానీ, గుకేశ్ తల్లిదండ్రులు ఈఎన్‌టీ సర్జన్‌ అయిన రజినీకాంత్, మైక్రోబయాలజిస్ట్ అయిన పద్మ చెన్నైలో స్థిరపడ్డారు. అక్కడే 2006లో గుకేశ్‌ పుట్టాడు. ఏపీలో ఇప్పటికీ బంధుత్వం కొనసాగిస్తున్నారు. బాల్యంలో అతడు వారి ఇళ్లకు వెళ్లేవాడు. గుకేశ్‌, అతడి తల్లిదండ్రులు కూడా తెలుగు మాట్లాడతారు.

వికీపీడియాలో తప్పు తప్పు

గుకేశ్ విజయం అనంతరం అతడి నేపథ్యం గురించి ఆరా తీసే క్రమంలో వికీ పీడియా చూడగా అందులో వివరాలు వేరుగా ఉన్నాయి. గుకేశ్ తల్లిదండ్రులది ఏపీలోని తూర్పుగోదావరి ఉంది. దీంతో గుకేశ్ గోదావరి జిల్లాల బిడ్డగా భావించారు. అయితే, పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చాక మాత్రం గుకేశ్ ది చిత్తూరు జిల్లా అని తేలింది.

చంద్రబాబు ట్వీట్ తో..

గుకేశ్ విజయానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన అభినందన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. తన ట్వీట్ లో గుకేశ్ ను తెలుగువాడిగా చంద్రబాబు సంబోధించారు. అయితే, దీనిపై తమిళులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, గుకేశ్ వికీపీడియా సమాచారాన్ని షేర్ చేస్తూ అతడు తెలుగువాడని తెలుగోళ్లు సమర్థిస్తున్నారు. దీంతో చంద్రబాబు ట్వీట్ పై తెలుగు-తమిళుల మధ్య రగడ రగడ నెలకొంది.

కొసమెరుపు: చంద్రబాబు క్రీడాభిలాషి. ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రపంచ చెస్ పోటీలు జరిగాయి. హంపి, హారికలను బాగా ప్రోత్సహించారు కూడా. మరోవైపు చంద్రబాబు తమిళనాడుతో దగ్గరి అనుబంధం ఉండే చిత్తూరు జిల్లాకు చెందినవారు. గుకేశ్ పూర్వీకులదీ ఇదే జిల్లా.