Begin typing your search above and press return to search.

ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాలంటే బాబు ఇలా చేయాలేమో..!

కూటమి స‌ర్కారు దూకుడు పెంచింది. సూప‌ర్ సిక్స్‌ను అమ‌లు చేస్తూనే.. మ‌రోవైపు కీల‌క‌మైన అభివృద్ది వైపు దృష్టి పెట్టింది.

By:  Tupaki Desk   |   14 Nov 2024 5:28 AM GMT
ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాలంటే బాబు ఇలా చేయాలేమో..!
X

కూటమి స‌ర్కారు దూకుడు పెంచింది. సూప‌ర్ సిక్స్‌ను అమ‌లు చేస్తూనే.. మ‌రోవైపు కీల‌క‌మైన అభివృద్ది వైపు దృష్టి పెట్టింది. ప్ర‌ధానంగా ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున గ‌త వైసీపీ స‌ర్కారుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అంశం.. ర‌హ‌దారులు. చిన్న చిన్న గుంత‌ల‌ను కూడా పూడ్చేందుకు నిధులు ఇవ్వ‌లేద‌ని ఎమ్మెల్యేలు సైతం అనేక సంద‌ర్భాల్లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ కార‌ణంగానే మైల‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఆయ‌నొక్క‌రే కాదు.. చాలా మంది పార్టీలో ఉండి కూడా.. ఇవే విమ‌ర్శ‌లు చేశారు. ఇది ప్ర‌జ‌ల‌ను బాగా ప్ర‌భావితం చేసింది. వైసీపీ హ‌యాంలో క‌నీసం ఒక్క చిన్న‌పాటి రోడ్డును కూడా నిర్మించ‌లేద‌న్న విమ‌ర్శ లు కూడా తార‌స్థాయికి చేరాయి. ఖ‌చ్చితంగా ఇలాంటి స‌మ‌యంలోనే.. కూట‌మి స‌ర్కారు ప‌క్కా వ్యూహం తో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. వ‌చ్చే సంక్రాంతి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ర‌హ‌దారుల‌ను బాగు చేయాల‌ని నిర్ణ‌యించింది.

దీనిలో భాగంగానే 2 వేలే కోట్ల రూపాయ‌ల‌ను ర‌హ‌దారుల‌కు కేటాయించారు. ఇవి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ర‌హ‌దా రుల నిర్మాణానికి స‌రిపోతాయి. ఇక‌, పంచాయ‌తీల‌కు 4 వేల కోట్ల రూపాయ‌ల‌ను కూడా కేటాయించారు. మొత్తంగా వ‌చ్చే సంక్రాంతికి ర‌హ‌దారులు మెరుస్తాయ‌న్న‌ది కూట‌మి నాయ‌కులు చెబుతున్న మాట‌. అయితే..ఇక్క‌డే నిశిత విమ‌ర్శ‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ ప‌నులు చేసేందుకు సాధార‌ణంగా కాంట్రాక్ట‌ర్ల‌ను నియ‌మిస్తారు. దీనికి గాను.. ఐదేళ్ల కాల‌ప‌రిమితిలో ప‌నులు చేసిన వారిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌న్న‌ది నిబంధ‌న‌.

కానీ, గ‌త ఐదేళ్ల‌లో వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ అనుకూల కాంట్రాక్ట‌ర్లు మాత్ర‌మే ప‌నులు చేశారు. దీంతో టీడీపీ అనుకూల కాంట్రాక్ట‌ర్లు.. సైలెంట్ అయ్యారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తాజాగా ఈ నిబంధ‌న‌ను స‌డ‌లించింది. ఐదేళ్ల నుంచి ప‌నులు చేస్తున్న‌వారు కాదు.. గ‌త ప‌దేళ్ల నుంచి కాంట్రాక్టుల రంగంలో ఉన్న‌వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం భావించింది. దీనికి సంబంధించి జీవో ఇచ్చింది. ఇదే విమ‌ర్శ‌ల‌కు దారి తీసేలా చేసింది.

ప‌దేళ్లు అంటే.. గ‌త టీడీపీ హ‌యాంలో ప‌నులు చేసిన ఆ పార్టీ అనుకూల కాంట్రాక్ట‌ర్ల కోస‌మే ఇలా నిబంధ న స‌డ‌లించారంటూ.. ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల జ‌డి ఎక్కువ‌గా గ్రామీణ ప్రాంతాల్లో వినిపిస్తోంది. దీని నుంచి బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం టీడీపీపై ఉంది. ఈ క్ర‌మంలో అనుభ‌వం ప్రాతిప‌దిక‌గా.. ప‌దేళ్ల నుంచి కాంట్రాక్టు రంగంలో ఉన్న‌వారికి ప్రాధాన్యం ఇస్తే.. కూట‌మి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కాబ‌ట్టి ఆదిశ‌గా చంద్ర‌బాబు ఆలోచ‌న చేయాల్సి ఉంది.