జగన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాబు
ఏపీలో సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ ల మధ్య రాజకీయ రచ్చ సాగుతూనే ఉంది. అది లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి విషయం దాటి ఇపుడు డిక్లరేషన్ దాకా వచ్చింది
By: Tupaki Desk | 27 Sep 2024 3:42 PM GMTఏపీలో సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ ల మధ్య రాజకీయ రచ్చ సాగుతూనే ఉంది. అది లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి విషయం దాటి ఇపుడు డిక్లరేషన్ దాకా వచ్చింది. తనను తిరుమల రాకుండా అడ్డుకుంటున్నారు ఇది రాక్షస ప్రభుత్వం అని జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చంద్రబాబుని విమర్శించారు.
ఆ వెంటనే చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారు. జగన్ చెప్పిన వాటిని ఆయన చేసిన విమర్శలను తాను ఖండించకపోతే ప్రజలకు విషయాలు తెలియవు అని అన్నారు. అందుకే తాను మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. జగన్ ని అసలు తిరుమల రావద్దు అని ఎవరు అన్నారు అని చంద్రబాబు ప్రశ్నించారు.
రావద్దు అని ఎవరైనా నోటీసులు ఇచ్చారా అని అడిగారు. ఇస్తే చూపించాలని ఆయన కోరారు. తిరుమలలో కొన్ని పద్ధతులు ఉంటాయని వాటిని ఎవరైనా పాటించి తీరాల్సిందే అని అన్నారు. అంతే కాదు ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవకుండా సెక్షన్ 30ని అమలు చేస్తున్నారు అని అన్నారు.
జగన్ అన్ని మతాలను గౌరవిస్తాను అని అంటున్నారు. అలాంటపుడు ఆయన హిందూ మతాచారాలను గౌరవించాలి కదా అని అన్నారు. తాను క్రైస్తవుడిని అని ఆయన అంగీకరించినపుడు ఇంట్లో బైబిల్ చదువుకోవడం ఎందుకు చర్చికి కూడా వెళ్లవచ్చు కదా అని చంద్రబాబు ప్రశ్నించారు.
డిక్లరేషన్ ఇమ్మని అధికారులు అడిగితే తన మతం మానవత్వం అంటున్నారు అని బాబు ఎద్దేవా చేశారు. జగన్ తిరుమల పర్యటన పెట్టుకోవడం మళ్లీ రద్దు చేసుకోవడంలో మతలబు ఏంటో తనకు తెలియదు అన్నారు. ఆయన పర్యటన రద్దుకు సాకులు ఏమి ఉన్నాయో కూడా తెలియదు అన్నారు.
ఆయనకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేకపోతేనే తన పర్యటనను రద్దు చేసుకుని ఉండవచ్చు అని అన్నారు. గతంలో తాను సంతకం పెట్టలేదని, ఇపుడు కూడా పెట్టను అంటే ఎలా కుదురుతుందని అన్నారు. అప్పట్లో దౌర్జన్యంగా వెళ్లామని ప్రతీ సారీ అలా చేయడానికి కుదురుతుందా అదే శాశ్వతమైన అధికారం అనుకున్నారా అని నిలదీశారు.
జగన్ విషయంలో ఇలా ఉంటే ప్రజలకు ఏమి జవాబు చెప్పగలమని అన్నారు. శాసనాలు చేసే శాసనసభ్యులే చట్టాలను గౌరవించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తిరుపతి స్వామి ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అని ఎండీడీబీ రిపోర్టు ఇస్తే దానినే తప్పు పడుతున్నారు అని జగన్ మీద ఫైర్ అయ్యారు. అందులో నుంచే నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వాడారని బాబు చెప్పారు. జగన్ అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నరు.
భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో జగన్ సీఎం గా ఉండగా రామతీర్ధంలో విగ్రహాల మీద దాడి చేస్తే చర్యలు లేవని చంద్రబాబు అన్నారు. ఆలయాల్లోకి దళితులను రానీయవడం లేదని ఎవరు చెప్పారని ఆయన నిలదీశారు.
మొత్తం మీద చూస్తే తనను తిరుమల రాకుండా అడ్డుకుంటున్నారు అని మాజీ సీఎం అంటే ఆయనను ఎవరు వెళ్లవద్దు అన్నారని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మరి ఈ డైలాగ్ వార్ మరింతగా ఎక్కడికి వెళుతుందో చూడాల్సి ఉందని అంటున్నారు.