Begin typing your search above and press return to search.

దావోస్ టు ఢిల్లీ.. విశ్రాంతి తీసుకోని చంద్రబాబు

ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాజధాని కోసం ప్రస్తుతం 26 వేల కోట్ల రూపాయలు సమకూరాయి.

By:  Tupaki Desk   |   24 Jan 2025 5:16 AM GMT
దావోస్ టు ఢిల్లీ.. విశ్రాంతి తీసుకోని చంద్రబాబు
X

ఏపీ సీఎం చంద్రబాబు స్టైలే వేరు. 74 ఏళ్ల వయసులో కూడా నవ యవ్వన యువకుడిలా కష్టపడటం ఆయనకే చెల్లింది. నాలుగు రోజులుగా గడ్డకట్టే చలిలో దావోస్ లో పర్యటించిన చంద్రబాబు ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా నేరుగా ఢిల్లీలో వాలిపోయారు. దీంతో ఆయన టూర్ పై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా బిజీబిజీగా గడిపిన చంద్రబాబు అసలు ఆకస్మికంగా ఢిల్లీ ఎందుకు వెళ్లాల్సివచ్చింది? ఢిల్లీ టూర్ స్పెషలేంటంటూ అంతా ఆరా తీస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దావోస్ లో పెట్టుబడుల వేట ముగించిన అనంతరం ఢిల్లీలో నిధుల వేట మొదలుపెట్టారు చంద్రబాబు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం బడ్జెట్ రెడీ చేస్తోంది. ఈ బడ్జెట్ లో రాష్ట్రానికి అధిక కేటాయింపులు ఉండేలా చూసేందుకు సీఎం ఢిల్లీ వెళ్లారు. ఈ టూరులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు వ్యవసాయ, ఇంధన శాఖ మంత్రులతో భేటీ అవ్వనున్నారు.

ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించారు సీఎం చంద్రబాబు. ఈ పెట్టుబడుల ద్వారా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగవ్వడంతోపాటు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. ఇక బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని సీఎం ఆలోచిస్తున్నారు. గత ఏడాది ఓటాన్ బడ్జెట్ వల్ల పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిధులిచ్చినా, రాష్ట్రం ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ సారి సమయం ఉండటంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించాలని ముఖ్యమంత్రి టార్గెట్ గా పెట్టుకున్నారు.

ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాజధాని కోసం ప్రస్తుతం 26 వేల కోట్ల రూపాయలు సమకూరాయి. ఇంకా రూ.19 వేల కోట్లు సమీకరించాల్సివుంది. ఇందులో పెద్ద మొత్తం సర్దుబాటు చేయాలని, అదీ కేంద్రం గ్రాంటు కింద ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరుతున్నారు. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అవుతున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు అదనపు కేటాయింపులపై చర్చించనున్నారు.

ఇక రైతులకు మేలు జరిగేలా వ్యవసాయశాఖ ద్వారా సాయం చేయాలని సంబంధిత మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను కలవనున్నారు. అదేవిధంగా ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. హైడ్రోజన్ హబ్, సోలార్ పవర్ ఇలా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. వీటికి అవసరమైన అనుమతులు త్వరగా లభించేలా కేంద్రం చొరవ చూపాల్సివుంది. దీంతో సంబంధిత మంత్రిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలుస్తున్నారు.

మొత్తానికి విశ్రాంతి తీసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ టు ఢిల్లీ రావడంపై నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా కష్టపడటం చంద్రబాబుకే చెల్లిందంటూ ప్రశంసిస్తున్నారు. ఏదైనా చంద్రబాబు ప్రయత్నాలకు కేంద్రం కూడా సహకరిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.