మూడేళ్ల బాలుడి ప్రాణాల కోసం సీఎంవోను పరుగులు తీయించిన బాబు
తాజాగా మూడేళ్ల చిన్నారిని కాపాడుకోవటం కోసం చంద్రబాబు పడిన తపన చర్చనీయాంశంగా మారింది. ఒక దశలో సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం) సదరు బాబు ఆరోగ్యం కోసంపరుగులు తీయటమే కాదు..
By: Tupaki Desk | 22 Sep 2024 4:25 AM GMTతన వరకు వచ్చిన ఏ అంశాన్ని అయినా సరే వదలకుండా.. విడిచి పెట్టకుండా ఫాలో చేస్తున్న వైనం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా చేసినా.. అప్పటికి ఇప్పటికి ఒక మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఆదేశాలు ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం స్వయంగా ఫాలో అప్ చేయటం.. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందన్న ఆరాతో పాటు.. ఇష్యూ ఒక కొలిక్కి వచ్చి.. అంతా బాగున్నారన్న మాట అవతల వారి నుంచి వచ్చే వరకు అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది.
తాజాగా మూడేళ్ల చిన్నారిని కాపాడుకోవటం కోసం చంద్రబాబు పడిన తపన చర్చనీయాంశంగా మారింది. ఒక దశలో సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం) సదరు బాబు ఆరోగ్యం కోసంపరుగులు తీయటమే కాదు.. వైద్య సిబ్బంది బాలుడి ఇంటికే వెళ్లి.. ఆ పిల్లాడ్ని ప్రాణాపాయస్థితి నుంచి తప్పించిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అసలేం జరిగిందంటే.. విజయవాడలోని పాత రాజేశ్వరిపేటలో మూడేళ్ల బాలుడు దేవాన్ష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. టైఫాయిడ్ కు పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేని పరిస్తితి.
జర్వ తీవ్రతతో 14 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ 4 శాతానికి పడిపోయింది. దీంతో బాలుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్లింది. బాలుడి తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్న చంద్రబాబు రియాక్టు అయ్యారు. వైద్యుల టీంను బాధితుడి ఇంటికి నేరుగా పంపిన చంద్రబాబు.. పరీక్షలు చేయించటంతో పాటు మెరుగైన వైద్యం కోసం సీఎం పేషీ స్వయంగా రంగంలోకి దిగింది.
మెరుగైన వైద్య చికిత్స కోసం ఎల్ వోసీ ఇచ్చి నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది. 11 రోజుల పాటు జరిగిన చికిత్స అనంతరం బాలుడు కోలుకున్నాడు. ట్రీట్ మెంట్ జరుగుతున్న పదకొండు రోజులు బాలుడి ఆరోగ్యం గురించి సీఎం అడగటం.. సీఎంవో ఆయనకు అప్డేట్ ఇవ్వటం గమనార్హం. తాజాగా హెల్దీగా మారిన పిల్లాడు ఇంటికి చేరుకున్నాడు. దీంతో.. పిల్లాడి తల్లిదండ్రులు చంద్రబాబుకు దండం పెడుతూ.. తమ పిల్లాడికి పునర్జన్మను ఇచ్చింది చంద్రబాబేనని పేర్కొంటున్నారు. చంద్రబాబు చొరవతో ఫాలో అప్ చేసిన వైనాన్ని వారు చెబుతున్నారు. మొత్తంగా సమస్యకు స్పందించటం లాంటివి సీఎంలు చేయొచ్చు. కానీ.. తన వరకు వచ్చిన ఇష్యూ చివరి వరకు తేలే వరకు వెంబడపడి చేయించటం చంద్రబాబుకే సాధ్యమేమో?