మనవడు దేవాన్ష్ అంటే చంద్రబాబుకు అంత ఇష్టం!
దేవాన్ష్ పుట్టినరోజు రావడంతో చంద్రబాబు తనకున్న అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
By: Tupaki Desk | 21 March 2025 4:37 PM ISTవయసు పెరిగేకొద్ది బంధాలు కావాలనిపిస్తోంది. మన చుట్టు కొడుకులు, కోడల్లు, మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా గడపాలనిపిస్తోంది. యవ్వనం, మధ్యమంలో రాజకీయాలను ఏలిన చంద్రబాబులోనూ ఈ 70 ఏళ్ల వయసు వచ్చేసారికి ఆ మార్పు కనిపిస్తోంది. మీరు మారారు బాబూ అంటూ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నాయుడులో గత ఐదేళ్లలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఒకప్పుడు పార్టీ, రాజకీయం అంటూ క్షణం తీరిక లేకుండా గడిపిన ఆయన ఇప్పుడు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా తన మనవడు దేవాన్ష్ అంటే ఆయనకు ఎంతో ప్రేమ. అది మరోసారి తాజాగా నిరూపితమైంది..
దేవాన్ష్ పుట్టినరోజు రావడంతో చంద్రబాబు తనకున్న అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మనవడితో కలిసి రోజంతా గడపాలని నిర్ణయించుకున్నారు. ఉదయాన్నే దేవాన్ష్‌ను తీసుకుని తిరుమలకు బయలుదేరారు. మనవడిని స్వయంగా ఎత్తుకుని మెట్ల దారిలో నడుచుకుంటూ వెళ్లారు. దారి పొడవునా దేవాన్ష్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. తిరుమల చేరుకున్నాక స్వామివారి దర్శనం చేసుకున్నారు. దేవాన్ష్ చేతుల మీదుగా స్వామివారికి హారతి ఇప్పించారు. అనంతరం అక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా మనవడితో కలిసి వడ్డించారు. ఈ రోజు మొత్తం తన మనవడితోనే గడిపారు. దేవాన్ష్ ఆడుతూ పాడుతుంటే మురిసిపోయారు.
ఒకప్పుడు రాజకీయాల్లో తనను తీవ్రంగా వ్యతిరేకించిన పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కూడా చంద్రబాబు ఇటీవల కలిసిపోయారు. కుటుంబ బంధాలకు ఆయన ఎంత విలువ ఇస్తున్నారో ఇది తెలియజేస్తుంది. చంద్రబాబులోని ఈ మార్పు ఆయన కుటుంబ సభ్యులను ఎంతో సంతోషానికి గురి చేసింది. "చంద్రబాబు గారు పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు మాకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దేవాన్ష్ వచ్చిన తర్వాత ఆయనలో మరింత మార్పు వచ్చింది. మనవడితో ఆడుతూ పాడుతూంటే చూడముచ్చటగా ఉంటుంది" అని చంద్రబాబు బంధువులు మురిసిపోతున్నారట..
చంద్రబాబు బిజీ షెడ్యూల్ లోనూ కుటుంబంతో కలిసి తిరుమలలో గడపడం కుటుంబానికి ఆహ్లాదాన్ని పంచింది. ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే చంద్రబాబును ఇలా చూడటం వారికి కొత్త అనుభూతినిచ్చింది. ఈరోజు చంద్రబాబు కేవలం తాతగా మాత్రమే కనిపించారు. రాజకీయ నాయకుడి హోదాను పక్కనబెట్టి మనవడితో ఆడుతూ, నవ్వుతూ ఒక సాధారణమైన తాతలా గడిపారు. దేవాన్ష్ పుట్టినరోజు చంద్రబాబు కుటుంబానికి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. అంతేకాదు, కాలం మనిషిని ఎలా మారుస్తుందో చెప్పడానికి చంద్రబాబు జీవితమే ఒక ఉదాహరణగా నిలిచింది.
- తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతి రద్దు చేసిన చంద్రబాబు
తిరుపతి పట్టణంలోని అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సంబంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఈ ప్రాజెక్టుకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతిని రద్దు చేశారు. "తిరుపతిలో హోటల్‌కు ఇచ్చిన అనుమతిని మేము ఉపసంహరించుకుంటున్నాము. తిరుమల కొండల సమీపంలో హిందూ విశ్వాసానికి విరుద్ధమైన ఏ కార్యకలాపాలను మేము అనుమతించము. ఏడు కొండల పవిత్రతను కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నాము" అని తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అన్నారు.
ఓబెరాయ్ గ్రూప్ అభివృద్ధి చేయతలపెట్టిన ముంతాజ్ హోటల్‌కు భూమి కేటాయింపు హిందూ సంఘాలు, మత పెద్దల నుండి నిరసనలకు దారితీసింది. ఈ హోటల్ నిర్మాణం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుందని .. సనాతన ధర్మానికి ముప్పు కలిగిస్తుందని వారు ఇటీవల ప్రదర్శన నిర్వహించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ ప్రాజెక్టుపై తన వైఖరిని స్పష్టం చేస్తూ అఫిడవిట్‌ను సమర్పించింది. అఫిడవిట్‌లో టీటీడీ ఈఓ జె. శ్యామల రావు మాట్లాడుతూ ఓబెరాయ్ గ్రూప్‌కు హోటల్ నిర్మాణం కోసం కేటాయించిన తిరుపతి రూరల్ మండలం, పెరురు గ్రామంలోని 20 ఎకరాల భూమి కేటాయింపును రద్దు చేయాలని కోరుతూ గత ఏడాది నవంబర్ 18న టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసిందని తెలిపారు.