బడ్జెట్‌పై బాబు డైలమా.. రీజనేంటి..!
అయితే.. ఇవన్నీ చూపిస్తే.. ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే 75 వేల కోట్ల రూపాయల వరకు అప్పులు చేశారు.
By: Tupaki Desk | 1 Nov 2024 4:45 AM GMTఏపీ వార్షిక బడ్జెట్ విషయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు డోలాయమానంలో పడ్డారు. బడ్జెట్‌ను ప్రవేశ పెడతామని చెబుతున్నా.. దానికి తగిన ప్రాతిపదిక అయితే.. కనిపించడం లేదు. అప్పులు చేయకూడదని లక్ష్మణ రేఖలు గీసుకోకపోయినా.. కొంత మేరకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. కానీ, అది కూడా సాధ్యం కావడం లేదు. మరోవైపు సంక్షేమ పథకాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్నది ఒక్కటే. అది కూడా ఉచిత గ్యాస్ పథకమే.
ఈ నేపథ్యంలో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశ పెడితే.. ఖచ్చితంగా ఆయా అంశాలను ప్రస్తావించాల్సి వస్తుంది. లోటు సహా ఆదాయ, వ్యయాలను చూపించాలి. అయితే.. ఇవన్నీ చూపిస్తే.. ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే 75 వేల కోట్ల రూపాయల వరకు అప్పులు చేశారు. అంటే.. సర్కారు వచ్చిన నాలుగు మాసాల్లోనే ఈ రేంజ్‌లో అప్పులు చేయడం సంచలనమే. జగన్ వచ్చిన తొలి నాలుగు మాసాల్లో చేసింది 22 వేల కోట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అప్పులు పెరిగిపోయాయి.
ఇవన్నీ బడ్జెట్లో చూపిస్తే.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు తప్పవు. పోనీ.. ఎమ్మెల్యేల బలం ఉంది కనుక .. సభలో మాటల యుద్ధం చేసి సభను నడిపించేయొచ్చు. కానీ ప్రజానీకానికీ, ముఖ్యంగా సోషల్ మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మౌనంగా ఉంటే.. మరింతగా ప్రభుత్వంపై ఇబ్బందికర పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా బడ్జెట్ రూపకల్పనపై చంద్రబాబు అంతర్మథనం పడుతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే పయ్యావుల కేశవ్ పని మొదలు పెట్టినా.. ఆర్థిక శాఖ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.. బడ్జెట్‌లో ఏం చూపించాలి? ఏం చూపించకూడదు? అనే సమాచారం.. మొత్తంగా కూడా ఒక పెద్ద గందరగోళంగా మారింది. ఈ క్రమంలో నవంబరు రెండో వారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ఏం చేయాలన్న విషయంపై చంద్రబాబు డైలమాలో ఉన్నారు. అయినా.. బడ్జెట్ ను ప్రవేశ పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి.