Begin typing your search above and press return to search.

బాబు కలలు...టార్గెట్ 2047 నా ?

ప్రతీ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావాలని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 3:53 AM GMT
బాబు కలలు...టార్గెట్ 2047 నా ?
X

ఏపీకి ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని ఒక భారీ లక్ష్యం చంద్రబాబు పెట్టుకున్నారు. అంతే లక్షల మందికి ఉపాధి కల్పించాలని కూడా మరో టార్గెట్ గా ఉంది. ఏపీ నుంచి నలభై బిలియన్ డాలర్ల ఎగుమతులు వెళ్ళేలా చూడాలని అనుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావాలని అంటున్నారు.

బాబు ఆశలు మంచివే. కలలు కూడా గొప్పవే అవి నెరవేరేది ఎపుడు అన్నదే ఇక్కడ చర్చ. ఏపీ పది లక్షల కోట్లకు పైగా అప్పుతో ఉందని జీతాలకు కూడా ఇబ్బందిగా ఉందని ఇదే ప్రభుత్వం చెబుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినా అప్పుల బాధ తప్పడం లేదు.

ఇక సంపద సృష్టి జరిగింది అంటే జరిగింది ఎందులో అంటే మందు బాబుల దయతో మద్యం దుకాణాలలోనే అని అంటున్నారు. పెద్దగా ఆయాసం లేకుండా మద్యం షాపుల దరఖాస్తులలో. వచ్చిన ఎనిమిది వేలకు పైగా దరఖాస్తులలో. సర్కార్ పంట పండింది. ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి.

అన్నీ బాగుంటే మద్యం ఆదాయమే దండీగా రావచ్చు. అది తప్ప మరోటి ఏదైనా అంత లాభసాటిగా సర్కార్ కి నాలుగు కాసులు వచ్చే విధంగా కనిపించడం లేదు. అమరావతికి కేంద్ర సాయమో రుణంలో మరేమో తెలియని ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక చేయూత పదిహేను వేల కోట్ల రూపాయలు దఫాలుగా రావచ్చు.

అవి వచ్చినా అమరావతి వంటి భారీ ప్రాజెక్ట్ కి ఏ మూల సరిపోతాయో కూడా తెలియని పరిస్థితి. ఆగస్టు నెలాఖరు సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన భారీ వానలతో అమరావతి కి కూడా ఇబ్బందులు వచ్చి నీట మునిగింది. అయితే దానికి కొత్త రకం డిజైన్లు చేసి రక్షణ గోడలు కట్టి ఇంకా ఆధునిక సాంకేతిక సంపత్తితో అన్నీ చేసి అభేధ్యంగా దుర్భేద్యంగా అమరావతిని తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ చెప్పారు.

దానికి అయ్యేది ఇప్పటి ఖర్చుకు మరింత అదనం. అంటే అమరావతి ఎలా చూసుకున్నా కాస్ట్లీ ప్రాజెక్ట్ అని అంటున్నారు. అది ఒక రూపునకూ షేపునకూ వచ్చేసరికే ఎంత కాలం పడుతుందో తెలియదు. ఆ మీదట అది సంపద ఫలాలు కాయాలి.

పోలవరం విషయంలో కూడా కధ అంతే. కేంద్రం ఇచ్చేది పిసరంతా కండిషన్లు కొండంత. అది కూడా ఎపుడు పూర్తి అవుతుందో తెలియదు. ఇక ఏపీలో దాదాపుగా అన్ని జిల్లాలు వెనకబడే ఉన్నాయి. ప్రతీ చోటా అభివృద్ధి చేయాలంటే దండీగా నిధులు ఉండాలి.

ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలకు సామాజిక పించన్లకు తెచ్చిన అప్పులకు కట్టే వడ్డీలకు తప్ప మరి దేనికీ సరిపోవడం లేదు అని అంటున్నారు. మరి ఇన్ని తెలిసి కూడా ఏపీని బ్రహ్మాండంగా చేస్తామని చెబుతున్నారు కూటమి పెద్దలు.

మంచిదే ఆశావహంగా ఉండడం చాలా మంచిదే. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినంత సులువు కాదు కదా ఆచరణలో అనీ జరగడం అన్న విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా చంద్రబాబుని మెచ్చుకోవాలి. ఆయన ఎపుడూ నిరాశతో కృంగి పోరు. ఏదో చేయాలని అనుకుంటారు. అన్నీ చేస్తామని జనాలకు చెబుతూ ఉంటారు.

దాని వల్ల మా ఏపీ బంగారం అని అనుకునే వారు కూడా ఉన్నారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పారు, కలలు కనమని, కలలు కనడం వరకూ ఓకే. వాటిని సాకారం చేసుకోవడం మీదనే సత్తా ఆధారపడి ఉంది. ఏపీ విషయంలో ఏదో చేయాలన్న పాలకుల ప్రయత్నాలు సఫలం కావాలనే అంతా కోరుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు వెక్కిస్తున్నాయి. చూడాలి మరి బాబు పట్టుదల ఏమి చేయిస్తుందో. అయితే బాబు ఇంతటి పవర్ పాయింట్ ప్రజంటేషన్ లోనూ 2047 అన్నది కూడా టార్గెట్ గా చెప్పుకొచ్చారు. సో చాలా టైం ఉంది అని కూడా అనుకోవచ్చు. అదన్న మాట మ్యాటర్.