బాబు గారు ఈ నిర్ణయం మంచిదేనా..?
విజన్ ఉన్న నాయకుడిగా పేరున్న సీఎం చంద్రబాబు.. గత ఏడు మాసాల్లో పెట్టుబడులపై దూకుడుగా ఉన్నారు.
By: Tupaki Desk | 6 Feb 2025 4:30 PM GMTవిజన్ ఉన్న నాయకుడిగా పేరున్న సీఎం చంద్రబాబు.. గత ఏడు మాసాల్లో పెట్టుబడులపై దూకుడుగా ఉన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలను తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ.. ఇంట్లో ఈగల మోత.. అన్నట్టుగా ఆయన పరిస్థితి ఉందన్న చర్చ సాగు తోంది. పాలన బాగుందని ఆయన చెప్పుకోవచ్చు.. కానీ, తీసుకుంటున్న నిర్ణయాలు పరిశీలిస్తే.. పాలన ఎలా ఉందన్నది ప్రజల తరఫున మరో మాట వినిపిస్తోంది.
ఇప్పటికి పింఛను పెంచి ఇస్తున్నామని.. అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నామని.. రహదారులు వేస్తున్నామని ఇంత కన్నా ఏం చేస్తామని కూటమి నాయకులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని నిర్ణయాల కారణంగా.. ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి. ప్రజల్లో జరుగుతున్న చర్చను నిశితంగా గమనిస్తే.. కూటమి విషయంలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. నిత్యావసరాల ధరలు ఎక్కడా అదుపులోకి రాలేదు. దీనిపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
ఈ విషయంలో చంద్రబాబుకు కూడా తెలుసు. ఇటీవల నిర్వహించిన ఐవీఆర్ ఎస్ సర్వేలో మెజారిటీ ప్రజలు ధరలపైనే ఎక్కువగా ప్రశ్నలు వేశారు. ఇక, మద్యం ధరలు తగ్గించడాన్ని దీనికి ముడి పెట్టి నిప్పులు చెరిగారు. మద్యం ధరలు తగ్గించారు కానీ.. నిత్యావసరాల ధరలను ఎందుకు తగ్గించడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక.. తాజాగా కీలకమైన విద్యా వ్యవస్థకు సంబంధించి సర్కారు తీసుకున్న నిర్ణయం మరింతగా అగ్నికి ఆజ్యం పోసేలా ఉంది.
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు భరించలేని స్థాయిలో ఉన్నాయని మధ్యతరగతి వర్గాలు పోరు పెడుతున్నా యి. తగ్గించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ, వాటి జోలికిపోకుండా.. తాజాగా ట్యూషన్ ఫీజులను మరింత పెంచుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో ఏటా ట్యూషన్ ఫీజులు పెంచడాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిరోధించింది. అంతేకాదు.. విద్యాప్రమాణాల ను పరిగణనలోకి తీసుకుని ఆయా సంస్థల స్థాయిని బట్టి.. నిర్ణయిస్తామని పేర్కొంది.
దీనిపై విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించినా.. వైసీపీ సర్కారు నిర్ణయం కరెక్టేనని రాష్ట్రంలోని తల్లిదండ్రుల కమిటీలు అప్పట్లో కోర్టులో ఇంప్లీడ్ అయి.. వాదనలు వినిపించాయి. దీంతో ఆ కేసును కొట్టేశారు. ఇప్పుడు ట్యూషన్ ఫీజుల విషయంలో సర్కారు నిర్ణయమే ఫైనల్. కానీ, దీనిని రాత్రికి రాత్రి మార్చేస్తూ.. ట్యూషన్ ఫీజులు నిర్ణయించుకునే అధికారం.. పెంచుకునే అధికారం కూడా.. ప్రైవేటు విద్యాసంస్థలకు కట్టబెడుతూ.. సర్కారు నిర్ణయం తీసుకుంది.
దీంతో ప్రజల జేబులు ఖాళీ చేసేందుకు విద్యాసంస్థలకు మరింత ఆయుధాలు సప్లయి చేసినట్టు అయింది. అంతేకాదు.. ఇది ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను తారాజువ్వలా పెంచేస్తుందనడంలో సందేహం లేదు. విస్తృత ప్రజానీకంపై ప్రభావం చూపించే ఇలాంటి నిర్ణయాలపై ఆచితూచి అడుగులు వేయకపోతే.. ఇప్పటి వరకు చేసిన మంచి అశిధారా వ్రతమే అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.