Begin typing your search above and press return to search.

పధకాలపై తేల్చేసిన చంద్రబాబు?

ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందులో ఉందని ఆయన చెప్పారు. తాము లోతుగా వెళ్ళిన కొద్దీ అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని ఆయన అన్నారు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 12:30 AM GMT
పధకాలపై తేల్చేసిన చంద్రబాబు?
X

మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. నీతి అయోగ్ నివేదిక మీద ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో ఏపీ గురించి మాట్లాడారు. ఏపీ ఆర్ధికంగా బాగా దెబ్బతినిపోయింది అని ఆయన అన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో ఆర్ధిక విధ్వంసం జరిగింది అని ఆయన అన్నారు.

ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందులో ఉందని ఆయన చెప్పారు. తాము లోతుగా వెళ్ళిన కొద్దీ అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని ఆయన అన్నారు. నీతి అయోగ్ ఇంకా కొన్ని విషయాలు మాత్రమే చూసిందని ఇంకా చాలా అంశాలు ఆర్ధికంగా ఉన్నాయని అన్నారు.

గత ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల వల్ల కూడా అనేక సమస్యలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తాము ముందుగా ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం అయితే ఉంది అని ఆయన అన్నారు. ఆర్ధిక వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు అనేకం ఉన్నాయని కూడా ఆయన అంటున్నారు.

సంక్షేమ పధకాలు అమలు చేయడం ఇపుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని ఆయన తేల్చేశారు. తల్లికి వందనం అలాగే అన్నదాతా సుఖీభవ వంటి పధకాలను తాము ఇస్తామని అయితే వాటికి సమయం పడుతుందని ఆయన అన్నారు. అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందని అభివృద్ధితోనే సంపద సృష్టి సాధ్యమని ఆయన చెప్పారు.

సంపద వచ్చాక సంక్షేమ పధకాలు కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. కేంద్రం వివిధ పధకాలకు ఇచ్చే నిధులు కానీ పోలవరం అమరావతి రాజధాని నిధులు స్టీల్ ప్లాంట్ ఆర్ధిక ప్యాకేజీల నుంచి వచ్చే నిధులను మళ్ళించి ఏపీలో కార్యక్రమాలను చేయలేమని అన్నారు.

ఆర్ధికంగా ఇబ్బందులు ఉంటే ప్రజల మీద పన్నుల భారం అధికంగా వేయాల్సి ఉంటుందని ఆ పరిస్థితి రాకుండా నియంత్రించుకోవాల్సి ఉంటుందని బాబు చెప్పారు. మొత్తానికి చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ పధకాల అమలు అన్నది ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పారు.

మరి దీని మీద జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి మరో వైపు దీని మీద వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఘాటుగానే రియాక్టు అయ్యారు. ఏపీ అప్పుల గురించి బాబుకు తెలిసే ఎన్నికల్లో హామీలు ఇచ్చారని అన్నారు. అందువల్ల హామీలు అన్నీ పూర్తి చేయాల్సిందే అని స్పష్టం చేశారు. లేకపోతే వైసీపీ ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని ఆయన హెచ్చరించారు.

ఏది ఏమైనా ఏపీలో సూపర్ సిక్స్ హామీల విషయంలో అయితే కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని చెబుతోంది. మరి దీని మీద కూటమి పెద్దలను జనాలకు నచ్చచెప్పి ఎంతవరకూ ఒప్పిస్తారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇవ్వలేకపోతున్నామని అంటే జనాలు విని ఊరుకుంటారా లేక ప్రభుత్వానికి సహకరిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.