పేదలు లేకుండా బాబు మంత్రం
ఏపీలో పేదరికం పోవడానికి పీ 4 ఫార్ములాను బాబు ప్రకటించారు. నిజానికి ఇది ఎన్నికల ముందు బాబు చెప్పినదే.
By: Tupaki Desk | 13 Jan 2025 4:38 AM GMTఏపీలో పేదలు లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన మంత్రంతో ముందుకు వస్తున్నారు. ఆయన ఏపీలో రానున్న రోజులలో పేదరికమే ఉండకూడదని కోరుకుంటున్నారు. అంతే కాదు వారి జీవితాలలో సరికొత్త సంక్రాంతి రావాలని ఆశిస్తున్నారు.
ఏపీలో పేదలు లేకుండా ఎలా అంటే బాబు దగ్గర అటువంటి మంత్ర దండం ఉందా అంటే ఉంది అని అంటున్నారు. ఎన్నో పదునైన వ్యూహాలకు చిరునామా అయిన చంద్రబాబు ఇపుడు పేదరికం సమూలంగా లేకుండా చేస్తాను అంటున్నారు. నమ్మి తీరాల్సిన ప్లాన్ తో ఆయన ముందుకు వస్తున్నారు.
ఏపీలో పేదరికం పోవడానికి పీ 4 ఫార్ములాను బాబు ప్రకటించారు. నిజానికి ఇది ఎన్నికల ముందు బాబు చెప్పినదే. పేదలను సంపన్నులు చేస్తాను అని బాబు ఒక కీలక హామీ ఇచ్చి ఉన్నారు. అది ఇపుడు కొత్త సంక్రాంతి వేళ ఆయన మరోమారు బయట పెట్టారు.
పీ 4 అంటే ఏంటో బాబు వివరిస్తూనే దానికి ప్రజల సాయం కావాలని అన్నారు. ఇంతకీ పీ4 అంటే పబ్లిక్ -ప్రైవేటు- పీపుల్-పార్టనర్ షిప్ అని చెబుతున్నారు. అంటే గతంలో మాదిరిగా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావడమే పీ 4 మంత్రం అని బాబు చెబుతున్నారు.
ఈ పీ4 తో ఆర్థిక అసమానతలు తగ్గించి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామని అంటున్నారు. దేశ విదేశాలలో ఉన్నత రంగంలో ఉన్న వారు సంపన్నులు ప్రజలల్లో చాలా మంది ఉన్నారని వారంతా చేరితే ఒక్కసారిగా భాగస్వామ్యం అవుతే చేతులు కలిపితే కచ్చితంగా పేదరికం పోతుంది అని చంద్రబాబు అంటున్నారు. అంటే ఉన్న వాడు లేని వాడికి తోడు కావాలన్న మాట. అలా పేదలకు అండగా ఉంటే వారు కూడా ఆర్ధిక ప్రమాణాలు పెంచుకుంటారని సంపన్నులు అవుతారు అని బాబు మార్క్ పీ4 ఉద్దేశ్యంగా చెబుతున్నారు.
మరి పీ4 స్కీం సక్సెస్ అవుతుందా అన్నదే చూడాల్సి ఉంది. పబ్లిక్ తో ప్రైవేట్ పార్టనర్ షిప్ కలవాలన్నా కూడా వారు ఊరకే ఏమీ చేయరు. వారు ఏదో ఫలితం కోరుకుంటారు. అపుడే ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తారు మరి ప్రజల వద్ద డబ్బులు ఉండవచ్చు కానీ ఇలా పీ4లో చేరి సాటి పేదలను బయటకు తీయడానికి ఎంతమంది సిద్ధమవుతారు అన్నదే చర్చ.
సంక్రాంతి వేళ బాబు ఇచ్చిన ఈ పిలుపు ఎంతమంది మది తలుపుని తడుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే బాబు ఆలోచన కాబట్టి అది ఏదో నాటికి ఏదో స్థాయికి సక్సెస్ అవుతుందని అనే వారు అలా నమ్మే వారు ఉన్నారు. బాబు మాటల మీద చాలా మందికి నమ్మకం ఉంది కాబట్టి కచ్చితంగా పీ4 అన్నది బాబు చేతిలో మంత్రదండమే అవుతుంది అని అంటున్నారు.