చంద్రబాబూ దొరకునా ఇటువంటి 'సేవ'.. !
ఏమాటకు ఆమాటే చెప్పుకొవాలి. సీఎం చంద్రబాబులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ప్రజలకు సేవ చేయడం. రెండు ప్రజలకు చేసేందుకు దక్కే పదవిని కాపాడు కోవడం.
By: Tupaki Desk | 18 Oct 2024 3:30 PM GMTఏమాటకు ఆమాటే చెప్పుకొవాలి. సీఎం చంద్రబాబులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ప్రజలకు సేవ చేయడం. రెండు ప్రజలకు చేసేందుకు దక్కే పదవిని కాపాడు కోవడం. గతంలో చేసిన తప్పులు.. ఇప్పుడు చేయకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం! ఈ ఫార్ములానే ఇప్పుడు బాబు అనుసరిస్తున్నారు. ఎందుకంటే.. దొరకునా ఇటువంటి సేవ.. అని పాడుకోవాలంటే పార్టీ నేతలు బలంగా ఉండాలి. తమ్ముళ్లు మరింత బలంగా ఎదగాలి. లేకపోతే.. ఏ ఖర్చు ఎటు నుంచి వచ్చినా.. భరించగలరో లేరో?!
అందుకే.. చంద్రబాబు చాలా జాగ్రత్తగా తన వారిని కాపాడుతున్నారు. కాపాడుకుంటున్నారు. కట్టు తప్పిన తమ్ముళ్లు అంటూ.. పెద్ద హెడ్డింగుతో వార్త వస్తే.. ఆ పత్రిక విలేకరికి ఒకప్పుడు చంద్రబాబు సన్మానం చేశా రు. అంతేకాదు.. సదరు జిల్లా తమ్ముళ్లతో మాట్లాడి వార్నింగులు.. వడ్డింపులు కూడా ఇచ్చారు. కట్ చేస్తే.. 2019లో అదే జిల్లాలో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తర్వాత పార్టీ పుంజుకునేందుకు మూడేళ్లు పట్టింది. దీనిని మనసులో పెట్టుకున్నారో.. ఏమో చంద్రబాబు ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తన ప్రమేయం లేకుండానే కొన్ని కొన్ని జిల్లాల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాయకులు ఉన్నారని ఆయన గుర్తించారు. ఇది వాస్తవం కూడా. ఉదాహరణకు అనంతపురం, కర్నూలు వంటి చోట్ల చంద్రబాబు ప్రమేయం అవసరం లేకుండానే స్థానికంగా ఉన్న బలమైన నాయకులు పార్టీని కొట్టుకు వచ్చేస్తారు. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. పరిస్థితి ఎలా ఉన్నా.. తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు. కానీ, వారికి కావాల్సింది.. `స్వేచ్ఛ`.. చంద్రబాబుకు కావాల్సింది `సేవ` ఈ రెండిటికీ లింకు బాగానే కుదిరింది. దీంతో చంద్రబాబు స్వేచ్ఛను వారికి వదిలేసి.. సేవను తాను తీసుకున్నారు.
దీని తాలూకు ఫలితం ఎలా ఉన్నా.. అంచనాలు మాత్రం బాగానే ఉన్నాయి. ``మీరుండండి మేం తేల్చే స్తాం`` అంటూ తమ్ముళ్లు చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం కాదంటారా? 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న వైసీపీని ఢీ అంటే ఢీ అనేలా ఎదుర్కొనకపోతే.. భవిష్యత్తులో అది ఎదిగితే.. ఎలా? అందుకే.. తమ్ముళ్లు ఎదగాలి. ఆర్థికంగా ఆధిపత్యంగా కూడా.. మనోళ్లదే పైచేయి కావాలన్న కీలక సూత్రాన్ని చంద్రబాబు పాటిస్తున్నారు.
ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. నాలుగు రోజులుగా ఓ కీలక అనుకూల మీడియా వ్యతిరక వార్త లు రాస్తోంది. తమ్ముళ్లను కార్నర్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన కీలక మంత్రి ఒకరు సదరు పత్రికకు నూరి పోశారు. మీరు ఇలా ఎందుకు రాస్తున్నారంటూ.. నిలదీశారు. ``ఆనాడు`` కనిపించ లేదా? అని కూడా ప్రశ్నించారట. అంతేకాదు.. ఐదేళ్లు మేం ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూడలేదా? అని నిలదీశారట. సో.. దీనిని బట్టి... సర్దుకు పోవాలన్న సంకేతాలు ఇచ్చేశారు!!