Begin typing your search above and press return to search.

తెలంగాణలో టీడీపీకి జవసత్వాలు.. వారి చేరిక వెనుక అంత పెద్ద ప్లాన్ ఉందా..?

ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంతో కొత్త రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లు లేకుండా పోయాయి.

By:  Tupaki Desk   |   8 Oct 2024 1:30 PM GMT
తెలంగాణలో టీడీపీకి జవసత్వాలు.. వారి చేరిక వెనుక అంత పెద్ద ప్లాన్ ఉందా..?
X

రాజకీయాలు ఒక్కో సారి ఆసక్తికరంగా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఔట్ డేటెడ్ అనుకున్న లీడర్లు అధికారం చేపట్టిన సందర్భాలు ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో ఇక ఆ పార్టీ పని అయిపోయినట్లే అన్న మాటల నుంచి పుంజుకున్న దాఖలాలు కనిపిస్తుంటాయి. ఇక.. అధికారంలో లేనన్ని రోజులు పార్టీలోని లీడర్లను కోల్పోయి భిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్న పార్టీ కూడా.. ఎన్నికల వచ్చేసరికి సత్తా చాటి అధికారం చేపట్టడం చూస్తుంటాం. సరిగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇదే అని చెప్పాలి.

ఆంధప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అస్సలు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఆయన రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించారు. రెండు ప్రాంతాలు తమకు రెండు కళ్లు అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. అంతేకాకుండా.. తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడా తెలపలేదు. దాంతో ఉద్యమ సమయంలో ఆ పార్టీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ పార్టీని తెలంగాణలో బ్యాన్ చేయాలన్న డిమాండ్ వినిపించింది.

ఇక.. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంతో కొత్త రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లు లేకుండా పోయాయి. అందులోని నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దాంతో ఆ పార్టీకి చివరకు రాష్ట్ర అధ్యక్షుడు కూడా లేని పరిస్థితి వచ్చింది. ఇక రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అయిపోయినట్లే అన్న అభిప్రాయం అంతటా వినిపించింది. ఈ పదేళ్ల పాటు కూడా తెలుగుదేశం పార్టీ పేరు తెలంగాణలో వినిపించలేదు. ఇక ఇటీవల మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో చంద్రబాబు చూపు ఇప్పుడు తెలంగాణపై పడింది. ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే.. వారానికి ఒకసారి హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ నేతలతో భేటీ అవుతున్నారు.

దాంతో కలిసొచ్చే అవకాశాల కోసం చంద్రబాబు ఎదురుచూస్తుండగా.. హైడ్రా అంశం ద్వారా ఆ చాన్స్ వచ్చింది. పార్టీకి ఎలా అయినా తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాలని చంద్రబాబు అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు. హైదరాబాద్, చుట్టుపక్కల పరిధిలోని చెరువులు, కుంటలను కబ్జాచేసి నిర్మించిన వాటిని కూల్చివేసేందుకే ప్రధానంగా ఈ హైడ్రాను తీసుకొచ్చారు. హైదరాబాద్ నగరాన్ని వరదల బారి నుంచి కాపాడేందుకు ఆయన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దాంతో నగరంలో అప్పటి నుంచి హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూనే ఉంది. పేద, ధనిక అన్న తేడా లేకుండా అక్రమం అని తెలిసిన నిర్ధారణ అయిన ప్రతీ కట్టడాన్ని నేలమట్టం చేస్తూ వస్తున్నారు. అటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతున్నారు.

దాంతో గత ప్రభుత్వంలో కొన్ని అక్రమాలకు పాల్పడిన వారంతా తమ అక్రమాల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నారు. తమ ఆస్తులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ గూటికి చేరాలని చర్చలు జరిపారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు వారికి ఏమాత్రం చాన్స్ ఇవ్వలేదు. పార్టీలో చేర్చుకునేందుకు అంగీకరించలేదు. దాంతో వారంతా ప్రత్యామ్నాయం వేటలో పడ్డారు. ఈ క్రమంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరడమే ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. ఇక.. ఒక్కో బీఆర్ఎస్ నేత చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరిస్తుండడంతో పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో చేరి.. తమ ఆస్తులను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రితో లాబీయింగ్ నడిపించ వచ్చని ఆరాటపడుతున్నారు. చంద్రబాబుతో రేవంత్‌కు చెప్పిస్తే తమ వ్యాపార సామ్రాజ్యానికి ఎటువంటి ఢోకా ఉండబోదని వీరి ఆలోచన. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో చేరితే ముందుముందు పార్టీ పరంగానూ ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ రాష్ట్రంలో పార్టీ పుంచుకుంటే.. ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకే ప్రాధాన్యం ఉంటుదన్న తీరులో ఆలోచిస్తున్నారట. అందుకే.. ఇప్పుడే చేరితే పార్టీలో ప్రాధాన్యతతోపాటు తమ ఆస్తులకూ రక్షణ దొరుకుతుందన్న ఉద్దేశం వారిలో కనిపిస్తోంది. మరోవైపు.. చంద్రబాబును ఆశ్రయిస్తున్న వారంతా కూడా బిగ్ షాట్స్ కావడంతో వారితో పార్టీ తొరగా పుంజుకునే అవకాశాలు కూడా ఉంటాయని అధినేత ఆలోచనతో ఉన్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికి నిన్నామొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న టీడీపీ పార్టీకి రానురాను జవసత్వాలు వచ్చే అవకాశాలు లేకపోలేదని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.