చంద్రబాబులో అసంతృప్తి?
చంద్రబాబు పనిమంతుడు. ఆ విషయంలో ఎవరికీ రెండవ మాట లేదు. ఆయన ఏడున్నర పదుల వయసులో కూడా రోజులో సగానికి పైగా సమయం కష్టపడతారు.
By: Tupaki Desk | 4 April 2025 10:30 AMటీడీపీ అధినేత, ఏపీలో కూటమికి నాయకత్వం వహిస్తూ నాలుగవ సారి సీఎం అయిన చంద్రబాబులో అసంతృప్తి ఉందా అంటే అవును అంటున్నారు. నిజానికి ఆయనే కూటమికి పెద్ద. ఎవరికి అయినా అసంతృప్తి ఉంటే తీర్చాలి. మరి బాబుకు ఏమిటి ఈ అసంతృప్తి. ఆయన అసంతృప్తి ఎవరు తీర్చాలి అంటే జవాబు దానికీ ఉంది.
చంద్రబాబు పనిమంతుడు. ఆ విషయంలో ఎవరికీ రెండవ మాట లేదు. ఆయన ఏడున్నర పదుల వయసులో కూడా రోజులో సగానికి పైగా సమయం కష్టపడతారు. ఒక్కోసారి మూడొంతులకు పైగా కష్టపడతారు. ఏ విషయంలో అయినా ఆయన తీరిక అన్నది చేసుకోరు. గంటల తరబడి సమావేశాలూ చేయగలరు, పర్యటనలూ చేయగలరు.
ఆయనకు అది సంతోషాన్ని ఇస్తుంది. కానీ బాబు మాదిరిగా ఆయన మంత్రివర్గం సహచరులు కష్టపడుతున్నారా అన్నదే చర్చగా ఉంది. బాబు కేబినెట్ లో అత్యధికులు యాభై ఏజ్ లోపే ఉన్నారు. అయినా కానీ బాబు స్పీడ్ ని అందుకోలేకపోతున్నారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి పది నెలలు కావస్తోంది.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి ఒక దారిలో పెడుతున్నారు. రోడ్ల అభివృద్ధితో పాటు పోలవరానికి అడ్వాన్స్ గా నిధులు తేవడం, అమరావతి రాజధానిని పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయాన్ని తీసుకుని రావడం, పెట్టుబడుల విషయంలో సీరియస్ గా ఫోకస్ పెట్టి తేవడం, అనేక చోట్ల పరిశ్రమలకు వాతావరణం క్రియేట్ చేయడం ఇలా చాలానే ఉన్నాయి.
ఇక సంక్షేమం విషయం తీసుకుంటే ఏపీలో నాలుగు వేల రూపాయలు నెలకు సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. ఇది ఒక రికార్డు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం కూడా రెండు వేల నుంచి మూడు వేల పెన్షన్ పెంచడానికి అయిదేళ్ళ వ్యవధి తీసుకుంది.
కానీ బాబు వస్తూనే ఎకాఎకిన వేయి రూపాయలు పెంచారు. ఇది వృద్ధులకు పేదలకు పెద్ద వరంగా ఉంది. అంతే కాదు లక్షల లబ్దిదారులకు వీటిని అందచేస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు పెట్టి కేవలం అయిదు రూపాయలకే టిఫిన్ భోజనం పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నారు
ఇలా పది నెలలలో చెప్పుకోవడానికి చాలానే చేశారు. కానీ మంచి చేసినా కూటమి ప్రభుత్వం ఎక్కడా గట్టిగా ప్రచారం చేసుకోలేకపోతోంది ఇదే విషయం మీద బాబు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఆయన మంత్రివర్గ సమావేశం తరువాత మంత్రులతో మాట్లాడుతూ మనం ఎంత చేసినా జనంలోకి అది చర్చగా వెళ్ళాలి. ఆ విధంగా చెప్పుకోవాలి. కానీ మనం చెప్పుకోలేక పోతున్నామని అన్నారని అంటున్నారు.
ఇక మీదట మంత్రులు అంతా ప్రభుత్వం చేసిన మంచిని జనంలో ఉంచి చర్చ పెట్టాలని ఆయన సూచించారు అని అంటున్నారు. చేసిన పనుల గురించి చెప్పుకోకపోతే ఇబ్బంది అన్నట్లుగా బాబు ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. విపక్ష వైసీపీ ఎంతసేపూ సూపర్ సిక్స్ హామీలు చేయలేదు అని టీడీపీ కూటమి మీద బండ వేస్తోంది. అయితే మేము కేవలం పది నెలల కాలంలో ఇన్ని చేశామని ధాటీగా చెప్పుకునే పరిస్థితి అయితే కూటమి నుంచి పెద్దగా లేకుండా ఉందని అంటున్నారు.
ఈ విషయంలో మంత్రులు గళం విప్పాలని చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తోంది. మంత్రులలో కొత్త వారు ఉండడంతో వారు ఇపుడిపుడే గాడిలో పడుతున్నారు. అయితే తమ శాఖల పనితీరుతో పాటుగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ఎప్పటికపుడు జనంలో ఉంచితేనే మంచి మార్కులు కూటమి సర్కార్ కి వస్తాయని అంటున్నారు. సో ఆ విధంగా బాబు సూచనలను పాటిస్తే కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం గ్రాఫ్ మరింతగా పెరుతుందని అంటున్నారు.