బాబు టార్గెట్ రీచ్ అయినట్లేనా ?
ఏపీ అంటే చంద్రబాబు డెఫినిషన్ వేరేగా ఉంటుంది. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం.
By: Tupaki Desk | 9 Oct 2024 5:30 AM GMTఏపీ అంటే చంద్రబాబు డెఫినిషన్ వేరేగా ఉంటుంది. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం. ఈ రెండూ ఎందుకు అంటే బాబుని చరిత్రలో నిలిపే ప్రాజెక్టులు. అమరావతి రాజధాని ఒక కొలిక్కి వస్తే చంద్రబాబు చిరకీర్తిని అందుకుంటారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ని తన హయాంలో పూర్తి చేస్తే బాబు సీఎంగా శాశ్వతమైన పేరుని సాధిస్తారు.
చిత్రమేంటి అంటే అమరావతి చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్. ఆయన కలల రాజధాని. ఆయన అపర విశ్వామిత్ర సృష్టి. దాని మీద మొత్తం హక్కుభుక్తాలు పేటెంట్ రైట్స్ అన్నీ ఆయనకే ఉన్నాయి. కానీ పోలవరం తీరు అలా కాదు, అది 1940లో వచ్చిన ఆలోచన. 1980లో అప్పటి సీఎం అంజయ్య చేతుల మీదుగా పునాది రాయి వేసుకున్న ప్రాజెక్ట్. ఆ మీదట 2004లో సీఎం అయిన వైఎస్సార్ ఏలుబడిలో అన్ని రకాల అనుమతులతో కదలిక వచ్చిన ప్రాజెక్ట్.
వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ గా కూడా పోలవరం చెప్పుకోవాలి. ఆయన దాని గురించే ఎక్కువగా మాట్లాడేవారు. ఆయన హఠాన్మరణంతో పోలవరం కొంత వెనకబడింది. విభజన ఏపీకి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో చేర్చడం, తొలి సీఎం గా చంద్రబాబు రావడంతో పోలవరం విషయంలో బాబుకు మంచి అవకాశం వచ్చింది. ఆయన అయిదేళ్ళ టెర్మ్ లో పోలవరం ప్రాజెక్ట్ బాగానే సాగింది.
ఇక 2019లో జగన్ సర్కార్ దాని మీద ఫోకస్ పూర్తిగా పెట్టి ఉంటే బాగుండేది అన్నదీ ఉంది. రెండు లక్షల 73 వేల కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ పధకాల కోసం అప్పులు చేసి మరీ వెచ్చించిన జగన్ సర్కార్ అందులో పదవ వంతు పెట్టినా తన తండ్రి కలల ప్రాజెక్ట్ పోలవరం పూర్తి చేసి ఉండేవారు అన్న మాట కూడా ఉంది.
ఇక వైసీపీకి వచ్చిన ఆ గోల్డెన్ చాన్స్ అలా మిస్ అయింది. మళ్ళీ బాబు వద్దకే పోలవరం వచ్చింది. దీనిని బట్టి చూస్తూంటే బాబుకే ఈ ఘనత అని చరిత్ర చెప్పినట్లుగానే ఉంది. దాంతో బాబు పోలవరం అమరావతి విషయంలో గట్టి పట్టుదలగానే ఉన్నారు.
ఆయన తాజాగా ఢిల్లీ టూర్ లో పోలవరానికి పాత బకాయిలు కింద 800 కోట్ల రూపాయలు, అలాగే అడ్వాన్స్ కింద మరో రెండు వేల కోట్ల రూపాయలు నిధులను తెచ్చుకోగలిగారు. దాంతో ఈ ఏడాది ఆఖరులో పోలవరం డాయాఫ్రం వాల్ నిర్మాణం పనులు స్టార్ట్ అవుతాయి. అది కనుక పూర్తి అయితే వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు ఒక కొలిక్కి వస్తుంది.
ఆ మీదట నిర్వాసితులకు పునరావాస ప్యాకేజిని కూడా తగినంత నిధులను తెచ్చి పూర్తి చేయగలిగితే పోలవరం డ్యాములలో గోదావరి నీళ్ళను నింపుకోవచ్చు. ఆ విధంగా శతాబ్ద కాలం నాటి పోలవరం కలను పండించుకోవచ్చు. ఇదీ బాబు ఆలోచనగా ఉంది. అయితే పునరావాస ప్యాకేజికి చాలా ఎక్కువ నిధులు అవసరం అవుతాయి. కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకునే సామర్థ్యం అయితే బాబుకు ఉందని అంటున్నారు.
ఇక అమరావతి రాజధాని వ్యవహారం తీసుకుంటే ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు సాగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రూపాయల నిధులలో కొంత ఈ ఆర్థిక సంవత్సరం అయ్యేలోగా ఇచ్చేందుకు ఓకే చెప్పిందని అంటున్నారు. కేంద్రం కూడా పూచీకత్తుగా ఉండడంతో తొందరలోనే నిధులు వస్తాయి. దాంతో నిర్మాణ పనులు మొదలవుతాయి.
దానితో పాటు అమరావతి రాజధానికి ఏపీలోని అన్ని జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారులు పూర్తి చేయాలని బాబు కేంద్రాన్ని కోరారు. అలాగే సౌత్ ఇండియాలోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరులను కలుపుతూ రైల్ కనెక్టివిటీని కూడా ఆయన కోరారు. ఇలా అమరావతి విషయంలో బాబు తన ఫోకస్ ని ప్రయారిటీని కేంద్రానికి చెప్పి ఒప్పించగలిగారు అని అంటున్నారు మొత్తానికి బాబు టార్గెట్ ని రీచ్ అయ్యారని ఢిల్లీ టూర్ సక్సెస్ అయింది అని అంటున్నారు