ఇప్పటి వరకు బాబుది ఒక లెక్క.. ఉగాది నుంచి మరో లెక్క!
అమరావతి పనులు రేపో మాపో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ఉగాది నుంచి మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
By: Tupaki Desk | 14 March 2025 8:15 AM ISTకూటమి సర్కారును ముందుండి నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు ఇప్పటి వరకు జరిగిన లెక్క ఒకటి.. ఇక నుంచి మరీ ముఖ్యంగా ఉగాది నుంచి జరగబోయే పాలన మరో ఎత్తు అన్నట్టుగా రాజకీయాలు సాగు తున్నాయి. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి నేటికి(13వ తేదీ) 9 మాసాలు పూర్తయ్యాయి. పదో నెలలోకి ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ క్రమంలో చంద్రబాబు పాలనలో మెరుపులు ఖాయంగా కనిపిస్తాయని పార్టీ నాయకులు చెబుతున్నారు.
సంక్షమం-అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్న చంద్రబాబు.. ఈ తొమ్మిది మాసాల్లో పాలనను పరుగులు పెట్టించారు. అయితే.. కొన్ని అవాంతరాలు మాత్రం ఎదురయ్యాయి. ప్రధానంగా తమ్ముళ్లే సహ కరించని పరిస్థితి వస్తోంది. అదేసమయంలో వివిధ ప్రాజెక్టులను కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి పోలవరం పనులు పూర్తిగా గాడిలో పడలేదు. అమరావతి పనులు రేపో మాపో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ఉగాది నుంచి మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
వీటికితోడు.. పీ-4 విధానాన్ని కూడా ఉగాది నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. తద్వారా పేదరికాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఉగాది నాటికి గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రహదారులు పూర్తి చేయాలని నిర్దేశించారు. అవి అందుబాటులోకి వస్తాయి. వీటికితోపాటు.. రైల్వే ప్రాజెక్టులను కూడా గాడిలో పెట్టే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. సో.. ఎలా చేసుకున్నా.. ఉగాది నుంచి మార్పులు ఖాయమని తెలుస్తోంది.
అదే సమయంలో మంత్రి వర్గ ప్రక్షాళన కూడా ఉగాది తర్వాత రోజు ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. మండలి నుంచి ఎంపికయ్యే నాగబాబుకు మంత్రి వర్గంలో చోటు ఖాయంగా ఉన్న నేపథ్యంలో మరో ఇద్దరిని కూడా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వారిలో వెనుకబడిన వారిని పక్కన పెట్టి.. కొత్తవారిని తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ కోటాలో పల్లా శ్రీనివాసరావు పేరు దాదాపు ఖాయమైందని సమాచారం. ఇలా.. ఉగాది నుంచి చంద్రబాబు పాలన మరో రూపం దాలుస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.