చంద్రబాబు: టీడీపీకి దశ-దిశ ..!
అన్నగారి లేని లోటును.. నాటి పునాదులను మరింత బలోపేతం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు విజన్.. పార్టీని బలమైన దిశగా ముందుకు సాగేలా చేసింది.
By: Tupaki Desk | 29 March 2025 9:50 AMటీడీపీ అంటే.. చంద్రబాబు. చంద్రబాబు అంటే.. టీడీపీ! ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్క డున్నా.. వారిలో సగం మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారే ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. అలా తెలుగు వారితో మమేకమైన పార్టీ టీడీపీ. పార్టీ స్థాపించినప్పుడు ఆయన లేకపోవచ్చు.. అన్నగారి హయాంలో పార్టీ పరుగులు పెట్టి ఉండొచ్చు. కానీ, చంద్రబాబు రాకతో.. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీ సాధించిన ప్రతివిజయంలోనూ.. చంద్రబాబు అడుగులు చిరస్థాయి!
నిజానికి అన్నగారు ఎన్టీఆర్.. ఇమేజ్‌తో పోల్చుకుంటే.. చంద్రబాబు ఇమేజ్ జీరో. అన్నగారికి సినీ రంగం ద్వారా సంక్రమించిన బలమైన ఇమేజ్ పార్టీని దశదిశలా వ్యాపింపజేసిందన్నది కూడా వాస్తవం. కానీ, ఎలాంటి ఇమేజ్ లేకపోయినా.. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. తనదైన విజన్‌తో ముందుకు సాగిన చంద్రబాబు.. అన్నగారి లేని లోటును.. నాటి పునాదులను మరింత బలోపేతం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు విజన్.. పార్టీని బలమైన దిశగా ముందుకు సాగేలా చేసింది.
భవిష్యత్తును ముందుగానే ఊహించిన చంద్రబాబు.. పార్టీని మరింత బలోపేతం చేయడంలో ముందుకు సాగారు. ఈ క్రమంలోనే మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీని మార్పుల దిశగా నడిపించారు. మూస విధానాలను పక్కన పెట్టి.. అందరికీ చేరువ అయ్యేలా చేశారు. సమస్య ఎక్కడ ఉంటే.. టీడీపీ అక్కడ వాలుతుందన్న నానుడిని నిజం చేశారు. టీడీపీ అంటే.. ఒకరి సొత్తు కాదు.. తెలుగు వారి అందరి ఆస్తి.. అన్న అన్న ఎన్టీ ఆర్ స్ఫూర్తిని నిజం చేసిన నాయకుడు చంద్రబాబు.
ఒకప్పుడు జాతీయస్థాయిలో వెలుగొందాలని పార్టీ భావించలేదు. తెలుగువారికి మాత్రమే పరిమితం కావాలని ఆనాడు ఎన్టీఆర్.. ఇప్పుడున్న చంద్రబాబు కూడా తలపోశారు. కానీ, కాలానుగుణంగా.. జాతీయ స్థాయిలో కూడా పార్టీ అనేక రూపాల్లో అప్రతిహత సమున్నత స్థాయికి చేరుకునేలా చేయగలగడంలో ఎన్డీయే కూటమి ద్వారా పార్టీసౌరభాలను ఢిల్లీ వీధుల వరకు వెళ్లేలా చేసిన ఘనత చంద్రబాబు సొంతమనే చెప్పాలి. ఇది మా పార్టీ.. అని సామాన్యులు సైతం అనేలా చేయడంలో చంద్రబాబు చేసిన కృషి.. పార్టీకి దశ-దిశ కల్పించాయనడంలో ఎలాంటి సందేహాలకు తావులేదన్నది వాస్తవం.