చంద్రబాబు ఆశలపై వరద 'గండి' .. !
నేపథ్యంలో చంద్రబాబు అంగరంగ వైభవంగా కార్యక్ర మాలు చేపట్టాలని నిర్ణయించారు.
By: Tupaki Desk | 5 Sep 2024 11:30 AM GMTసీఎం చంద్రబాబు ఆశలపై కృష్ణానది సహా బుడమేరు సృష్టించిన వరదలు గండి కొట్టాయి. ఈ వరదల కారణంగా.. సీఎం చంద్రబా బులో సంతోషం లేకుండా పోయింది. దీంతో ఆయన పెట్టుకున్న ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. వాస్తవానికి కూటమి సర్కారు ఏర్పడి... ఈ నెల 20కి 100 రోజులు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అంగరంగ వైభవంగా కార్యక్ర మాలు చేపట్టాలని నిర్ణయించారు. అమరావతిలోనూ.. పోలవరంలోనూ.. నిర్మాణాలు చేపట్టే కార్యక్రమానికి ఆరోజే ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు.
అయితే.. రాష్ట్రం ఎదుర్కొంటున్న వరుస విపత్తులతో 100 రోజుల పండుగను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. ఈ నెల 1నాటిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్‌లో నూ పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాలయ్య పంక్షన్‌లోనే దీనిని నిర్వహించాలని భావించారు. దీనికి అదనంగా కూడా.. కూటమి పార్టీల నేతలు .. కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. కానీ, అదే రోజు.. వరద చుట్టుముట్టడంతో.. చంద్రబాబు పంక్షన్లు మానేసి వరద బురదలో ప్రజలను కలుసుకోవాల్సి వచ్చింది.
ఇక, ఇప్పుడు 100 రోజుల కూటమి సర్కారు వేడుకను కూడా.. నిర్వహించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇక, కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. వరుసగా విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షాలతో కర్నూలు ఇబ్బంది పడినప్పుడు.. చంద్రబాబు అక్కడ పర్యటించారు. ఆ తర్వాత.. వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తొలి రెండు నెలలు కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరిగిన దాడులు.. హత్యలు సర్కారుకు తలనొప్పిగా మారాయి. ఆ తర్వాత.. మదన పల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం కావడం.. దీని నుంచి బయటకు వస్తే.. పోలవరం ఫైళ్లు దహనం కావడం వంటివి వరుసగా చోటు చేసుకున్నాయి.
ఇక, ఇటీవల అనకాపల్లి ఫార్మా సెజ్‌లో చోటు చేసుకున్న దారుణంలో 10 మందికిపైగా కార్మికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇక, తాజాగా వరదల కారణంగా.. అధికారిక లెక్కల ప్రకారమే 24 మంది మృతి చెందారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయలయ్యారు. 1,69,370 ఎకరాల్లో సాధారణ పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. 60 వేల కోళ్లు, 222 పశువులు చనిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,973 కిలోమీటర్ల మేర రోడ్లు, 22 విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. వీటి నుంచి కోలుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంత లేదన్నా.. నెల రోజుల సమయం పడుతుంది. సో మొత్తానికి చంద్రబాబు 100 రోజుల పండుగపైనా వరద గండికొట్టినట్టయింది.