జీవితం ఎవరికీ జాక్ పాట్ కాదు : చంద్రబాబు
తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సీఎం స్వర్ణ కుప్పం విజన్ డాక్యుమెంటును ఆవిష్కరించారు.
By: Tupaki Desk | 6 Jan 2025 2:30 PM GMTజీవితంలో ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే వైకుంఠపాళి తరహాలో కిందకి జారిపోతాం. రాజకీయం, వ్యాపారంతో సహా అన్ని రంగాలకూ ఇది వర్తిస్తుంది. జీవితం ఎవరికీ జాక్ పాట్ కాదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సీఎం స్వర్ణ కుప్పం విజన్ డాక్యుమెంటును ఆవిష్కరించారు. ముఖ్యమంత్రిగా నాలుగో సారి గెలిచేందుకు తానెంతో కష్టపడ్డానని చంద్రబాబు తెలిపారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని తాను అభివృద్ధి పథాన నడిపిస్తే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి 4% తగ్గిపోయిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని వివరించారు. ఈ సమయంలో కష్టపడి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాదులో తాను చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు ఫలాలు ఇస్తున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర 2047 సాధనకు పనిచేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గం కోసం ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించామని తెలిపారు.
రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై ప్రత్యేక ప్రణాళిక తయారుచేశాం, ఏటా ఎలాంటి పనులు చేయాలనే విషయం ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఓ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించినట్లు తెలిపారు. 2027 నాటికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం ప్రపంచంలోనే తొలి రెండు స్థానాల్లో ఉంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.