Begin typing your search above and press return to search.

జాతీయ రాజకీయాల్లో తులసీదళం చంద్రబాబు

అయితే రాజకీయాల్లో ఎపుడెలా ఉంటుందో ఎవరికీ తెలియదు, అందుకే బాబుకి రాచ మర్యాదలతో తమ వైపు ఉండేలా ఎన్డీయే పెద్దలు చూసుకుంటున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2024 2:58 AM GMT
జాతీయ రాజకీయాల్లో తులసీదళం చంద్రబాబు
X

టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రికి ఇవన్నీ తెలియనివి కావు. రాజకీయాల్లో తాడు పాముల మధ్య తేడా కూడా ఆయనకు బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితులను ఆయన కళ్లారా ఎన్నెన్నో చూసారు. ఇప్పటికి రెండేళ్ల క్రితం ఏకంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది. అంతే కాదు ఉండవల్లిలోని బాబు నివాసం మీద కూడా దాడి జరిగింది.

ఆ సమయంలో ఏపీ అట్టుడికింది. ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు తగిన స్థానం లేదని వారి స్వేచ్చకు భంగం కలుగుతోందని ఏకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని భావించి ఆనాడు చంద్రబాబు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అయితే అక్కడ చంద్రబాబు కొన్ని రోజుల పాటు ఉండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినా అది దొరకలేదు అని ప్రచారంలో ఉన్న మాట. ఆ తరువాత బాబు వెనక్కి తిరిగి వచ్చేశారు.

ఇక 2023 సెప్టెంబర్ నెలలో బాబు సడెన్ గా అరెస్ట్ అయ్యారు. అనూహ్యంగా 53 రోజుల పాటు ఆయన రాజమండ్రి జైలు గోడల మధ్య గడిపారు. ఆ సమయంలో కూడా కేంద్ర పెద్దల నుంచి మొదట ఆశించిన స్థాయిలో సహకారం దక్కలేదని ప్రచారం సాగింది. సీన్ కట్ చేస్తే ఇపుడు చంద్రబాబుని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆయన ఢిల్లీ వెళ్లాలే కానీ బీజేపీ టాప్ టూ బాటమ్ ఆయన వెంటనే ఉంటున్నారు. ఆయన మాటలే వింటున్నారు.

ఇవన్నీ ఎందుకు అంటే రాజకీయాలు ఇలాగే ఉంటాయి కాబట్టి. ఈ రాజకీయాలు ఈ సమీకరణలు బాబుకు కొత్త ఏమీ కావు. ఆయన దాదాపుగా యాభై ఏళ్ల రాజకీయాన్ని పండించుకున్న దిగ్గజ నాయకుడు. ఆయన ఫక్తు పొలిటీషియన్. ఆనాడు ఎందుకు అలా జరిగింది ఈనాడు ఎందుకు ఇలా జరిగింది అన్నది ఆయనకు చాలా సులువుగా తెలుస్తుంది.

బాబు అయితే దానినీ చూశారు దీనినీ చూస్తున్నారు. ఆయన అనుకునేది నమ్మేది కాలాన్ని. కాలం ఈ రోజు ఇలా కలసి వచ్చింది కాబట్టే ఈ మర్యాదలు అని కూడా అనుకోవచ్చు. ఈ రోజున జాతీయ రాజకీయాల్లో అత్యంత శక్తిమంతుడిగా చంద్రబాబు మాత్రమే ఉన్నారు. అంతే కాదు అప్పటికపుడు పరిస్థితులకు తగినట్లుగా ఎత్తులు వేయగల సామర్థ్యం కూడా బాబు సొంతం.

బాబు సాటి సుదీర్ఘ కాలం అనుభవం ఉన్న రాజకీయ నేతలు అయితే జాతీయ రాజకీయాల్లో లేరు. బాబు వయసు ఏడున్నర పదులు. ఈ రోజుకీ ఆయన చురుకుగా ఉంటారు. డైనమిక్ గా ఆలోచిస్తారు. అంతే స్పీడ్ గా రాజకీయాలు చేయగలరు.

చంద్రబాబు ఎన్డీయే సర్కార్ ని తన భుజాల మీద మోస్తున్నారు. ఆయన తలచుకుంటే కేంద్రంలో ప్రభుత్వాలే మారుతాయన్నది అందరికీ తెలిసిందే. కేవలం నలభై అయిదేళ్ళ వయసులోనే ఉమ్మడి ఏపీకి యువ ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ఢిల్లీలో చక్రం తిప్పి అధికారం బీజేపీకి దక్కకుండా చేసి షాక్ తినిపించారు. రాక రాక వాజ్ పేయి కి తొలిసారి దక్కిన ప్రధాని యోగాన్ని పదమూడు రోజులకే పరిసమాప్తం అయ్యేలా చూశారు.

అప్పటికపుడు యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కూటమిని కట్టించారు. కాంగ్రెస్ ని కమ్యూనిస్టులని ప్రాంతీయ పార్టీలని ఆ ఫ్రంట్ లో పెట్టి మరీ సుమారు రెండున్నరేళ్ల పాటు కేంద్రంలో రాజ్యం చేసేలా చూశారు. దటీజ్ చంద్రబాబు అనిపించుకున్నారు. ఆయన ప్రతిభను చూసిన వాజ్ పేయ్ అద్వానీ వంటి వారే బాబు తమతో ఉంటేనే కమలం వికసిస్తుంది అని భావించారు. ఆయనను చివరికి ఎన్డీయేలో చేర్చుకుని కన్వీనర్ పదవి అప్పగించారు.

ఇపుడు చూస్తే బాబు ఇంకా రాజకీయంగా రాటుదేలారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ మెజారిటీకి ముప్పయి సీట్లు తక్కువగా ఉంది. అవతల వైపు ఇండియా కూటమి 240 సీట్ల దాకా తెచ్చుకుంది. బాబు తలచుకుంటే ఆ మిగిలిన సీట్ల కొరతను తీర్చేసి ఎకాఎకీన ఇండియా కూటమిని సైతం కేంద్రంలో గద్దెనెక్కించగలరు.

అయితే ఆయన ఇపుడు జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టడం లేదు. ఏపీలో తానేంటో నిరూపించుకోవాలని చూస్తున్నారు. అమరావతిని నిర్మించి తమ పేరు శాశ్వతం చేసుకోవాలని తపిస్తున్నారు. పోలవరం పూర్తి చేసి ఏపీకి అపర భగీరధుడు కావాలని ఆలోచిస్తున్నారు ఏపీని అభివృద్ధి బాట పట్టించి తన పాలనా దక్షత చాటాలనుకుంటున్నారు.

అయితే రాజకీయాల్లో ఎపుడెలా ఉంటుందో ఎవరికీ తెలియదు, అందుకే బాబుకి రాచ మర్యాదలతో తమ వైపు ఉండేలా ఎన్డీయే పెద్దలు చూసుకుంటున్నారు అని అంటున్నారు. దానికి తోడు జమిలి ఎన్నికలు అన్న పెద్ద అజెండా ఉంది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మిత్రులలో అత్యంత విధేయుడిగా బాబు వారికి కనిపిస్తున్నారు. అంతే కాదు ఇపుడు బాబు ఒక తులసీదళంగా మారారు. ఆయన ఎటు వైపు మొగ్గితే ఆ వైపే విజయం, వారిదే అధికారం, అందుకే ఈ మర్యాదలు మన్నలను అన్నీనూ.