వైసీపీని ఒక్క లెక్కన వేసుకున్న బాబు !
ప్రతీ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ని కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని ఆయన అన్నారు.
By: Tupaki Desk | 12 March 2025 6:00 AM ISTఏపీ సీఎం చంద్రబాబు మాటలు తూటాల్లా పేలుతాయి. ఆయన ప్రతీ మాటలో వ్యూహం ఉంటుంది. అది స్పీచ్ గా బయటకు అనిపించినా ఎపుడు ఎవరికి ఎక్కడ తగలాలో అలా తగులుతుంది. ఇదిలా ఉంటే మంగళవారం అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ గురించిన అంశం మీద ముఖ్యమంత్రి మాట్లాడారు.
ఈ సందర్భంగా పరోక్షంగా ఆయన వైసీపీ మీద సెటైర్లు పేల్చారు. ఆ పార్టీ పెద్దల మీద ఘాటు కామెంట్స్ చేశారు. మధ్యలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుని తెచ్చి మరీ వైసీపీ నేతల తీరుని పూర్తిగా తూర్పార పట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పుకున్నారు.
తనది నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ జీవితం అన్నారు. తాను ఒక విధానపరంగా పద్ధతిగా రాజకీయం చేశాను అని ఆయన చెప్పుకొచ్చారు. నా రాజకీయ జీవితంలో ఎపుడూ హత్యా రాజకీయాలు చేయలేదని బాబు నిండు సభలో ప్రకటించారు. అలాంటి వాటికి తాను పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. హత్యా రాజకీయాలు చేసిన వారు, హత్యలు చేయించి ప్రత్యర్ధులను పోస్టు మార్టం దాకా నడిపించిన వారు తాము కూడా ఏదో రోజున అక్కడికే చేరుతామని గుర్తుంచుకోవాలని బాబు గట్టి హెచ్చరికలు చేయడం విశేషం.
రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడిన వారికి తగిన శిక్ష విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో నేరాలకు తావు లేదని అన్నారు. వివేకా హత్య కేసుని మొదట గుండె పోటు అన్నారని తరువాత గొడ్డలి పోటు అన్నారని బాబు వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు తండ్రి లేని వాడిని ఈ రోజున పినతండ్రి అన్న పెద్ద దిక్కు కూడా లేకుండా చేస్తారా అని నాడు వైసీపీ అధినాయకులు జనంలో సానుభూతి పొందేలా హడావుడి చేశారని నిందించారు.
అంతే కాదు తన చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని తమ మీడియాలో రాయించారని ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసి బురదను తనకు అంటించాలని చూశారని కానీ అవేమీ తనను తాకలేదని అన్నారు. తన రాజకీయ జీవితం ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టే ఈ అబద్ధాలు వీగిపోయాయని ఆయన అన్నారు.
ఇక చూస్తే లా అండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందని బాబు చెప్పుకొచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ని కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని ఆయన అన్నారు. లా అండ్ ఆర్డర్ బాగులేకపోతే ఏమీ చేయలేమని అన్నారు. జగన్ తెచ్చిన దిశా యాప్ ని దిక్కుమాలిన యాప్ అని నిందించిన చంద్రబాబు శక్తి యాప్ ని తాము అమలులోకి తెచ్చామని చెప్పారు.
దీనిని అంతా ఉపయోగించుకోవాలని కోరారు. ప్రజలలో చట్టాల పట్ల చైతన్యం అవగాహన పెరగాలని ఆయన కోరారు. అది లేకపోతే ఎన్ని తెచ్చినా వృధాయే అని అన్నారు. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసును సభలో ప్రస్తావించి మరోమారు వైసీఎపీని డిఫెన్స్ లో బాబు పడేశారు. అంతే కాదు తాను హత్యా రాజకీయాలకు దూరం అని ఆయన చెప్పారు.
రాజకీయాల్లో నేరగాళ్ళు అంటూ ఆయన విసిరిన పంచులు కూడా ఎవరికి తగలాలో వారికే అని అంటున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడమని తప్పు చేసిన వారికి అదే చివరి రోజుగా చేస్తమని బాబు వార్నింగ్ ఇవ్వడం కూడా చర్చగా ఉంది. మొత్తానికి చంద్రబాబు లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ రాజకీయ మెరుపులు మెరిపించారు. వైసీపీకి ఇండైరెక్ట్ గా ఎటాక్ చేస్తూ తన రాజకీయ జీవితం ఎంత పద్దతిగా ఉందో కూడా అటు సభలోని వారికి ఇటు బయట జనాలకు వివరించే ప్రయంతం చేశారు. వివేకా హత్య కేసు కాదు కానీ వైసీపీ విప్పుకోలేక తప్పుకోలేక కార్నర్ అవుతోంది అని అంటున్నారు.