Begin typing your search above and press return to search.

బాబు కూడా మూడు రాజధానుల పాటే !

ఉన్న ఒక్క దానికే దిక్కులేదు మూడు రాజధానులు ఏంటి అని జనాలు విస్తుబోయారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 3:48 AM GMT
బాబు కూడా మూడు రాజధానుల పాటే !
X

ఏపీలో మూడు రాజధానులు అంటూ అయిదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఒకే స్లోగన్ ని పట్టుకుని తెగ హడావుడి చేసింది. ఉన్న ఒక్క దానికే దిక్కులేదు మూడు రాజధానులు ఏంటి అని జనాలు విస్తుబోయారు. ఉన్న అమరావతికి కాస్తా కళ కట్టించండి అంటే దానికి అడవి మాదిరిగా చేసి పారేసిన వైసీపీ నేతలు మూడు రాజధానుల రాగం అందుకుని చివరికి ఇటీవల ఎన్నికల్లో భారీ ఓటమితో మాడు పగలగొట్టించుకున్నారు.

ఏపీలో టీడీపీ కూటమి అఖండమైన మెజారిటీతో అధికారంలోకి రావడానికి మూడు రాజధానుల రాంగ్ కాన్సెప్ట్ ఒక కీలకమైన కారణం అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా మూడు పాట మాత్రం వీడడం లేదు

అయితే జగన్ మాదిరిగా కాకుండా అపర చాణక్యుడు అయిన చంద్రబాబు మూడు ప్రాంతాలు మూడు రకాలుగా అభివృద్ధి అంటున్నారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని గట్టిగానే బాబు చెబుతున్నారు. అదే టైం లో మిగిలిన ప్రాంతాల వారిలో అసంతృప్తి చెలరేగకుండా ఆయన వారికీ సమాన న్యాయం చేస్తామని అంటున్నారు.

తాజాగా ఆయన మరో సారి దీని మీదనే కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీకి ఏకైక రాజధాని ఇది ఎన్డీయే నిర్ణయం అని బాబు అన్నారు. అమరావతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఏపీకి తలమానికంగా నిలబెడతామని చెప్పుకొచ్చరు.

అదే సమయంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేస్తామని అక్కడ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా చేసి అద్భుతమైన సిటీగా కర్నూలుని అభివృద్ధి బాట పట్టిస్తామని అన్నారు. ఇక విశాఖను ఆర్ధిక రాజధాని చేస్తామని బాబు తెలియచేశారు.

ఈ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణతో మూడు ప్రాంతాలలో సమానమైన ప్రగతిని చూపిస్తామని అంటున్నారు. ఇక్కడే జగన్ కి చంద్రబాబుకీ మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ పాలనను వికేంద్రీకరించాలని చూశారు. అది తప్పుడు కాన్సెప్ట్ అని అంతా అన్నారు కూడా.

చంద్రబాబు అలా కాకుండా అభివృద్ధిని అన్ని చోట్లా విస్తరిస్తామని అలా వికేంద్రీకరణను చేసి చూపిస్తామని అంటున్నారు. దాంతో బాబు కూడా అమరావతి విశాఖ కర్నూల్ ప్రాంతాలనే తీసుకుని అభివృద్ధి వికేంద్రీకరణతో వాటిని కూడా రాజధానులకు ధీటుగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. మరి చంద్రబాబు చెప్పిన మాటలు జనాలకు నచ్చుతాయా ఆయన మూడు జనాల మూడ్ ని మార్చి కూటమికి అది పాజిటివ్ గా మారుతుందా అన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.