Begin typing your search above and press return to search.

జైల్లో నన్ను చంపాలనుకున్నారట: చంద్రబాబు

స్కిల్ డెవల్మెంట్ కేసులో కొద్ది నెలల ఏడాది క్రితం అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును సీఐడీ అధికారులు, పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   10 Oct 2024 1:32 PM GMT
జైల్లో నన్ను చంపాలనుకున్నారట: చంద్రబాబు
X

స్కిల్ డెవల్మెంట్ కేసులో కొద్ది నెలల ఏడాది క్రితం అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును సీఐడీ అధికారులు, పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబుపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. 53 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా తాను జైల్లో ఉన్నప్పుడు తన అనుభవాలను చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ పాలనపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ హయాంలో తనను 53 రోజులు జైల్లో ఉంచారని, ఆ సమయంలో తనను చంపాలని చూసినట్లు ప్రచారం కూడా జరిగిందని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. జైలుపై డ్రోన్లు ఎగురవేశారని, సీసీ కెమెరాలు పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక, దోమ తెర ఇవ్వకుండా తన ఆరోగ్యం దెబ్బతీయాలని చూశారని వాపోయారు. అయితే, కక్ష సాధింపు రాజకీయాలు తనకు ఇష్టం లేదని, కక్ష సాధించడం తన లక్ష్యం కాదని అన్నారు. ఐదేళ్లలో అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పడింది తానేనని...తాను కూడా జగన్, వైసీపీ పాలన బాధితుడినేని చెప్పారు. నివాసంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వంపై, తనపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ దుష్ప్రచారాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తామని అన్నారు. వైసీపీ దుష్ప్రచారం మరీ మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసని చెప్పారు. జగన్ పాలనలో విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి కేంద్ర సాయం అడిగానని, ఆ క్రమంలోనే ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్ర మంత్రులను కలిశానని అన్నారు. జగన్ వంటి విధ్వంసకర వ్యక్తి చేతికి అధికారం వస్తే రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలం అవుతుందో ఏపీ ఒక కేస్ స్టడీ అని చెప్పారు.

సమైక్యాంధ్రలో మనం చేసిన డెవలప్మెంట్ వల్లే ఆ రాష్ట్రం ఇపుడు ఈ స్థితిలో ఉందని, విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలన వల్లే మనం ఎక్కువ నష్టపోయామన్నారు. ఎవరికి ఓటు వేస్తే సుస్థిరమైన పాలన వస్తుందో ప్రజలు ఆలోచించాలన్నారు. దక్షిణ భారతదేశంలో పెడితే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, అమరావతిని కలుపుతూ బుల్లెట్ ట్రైన్ వస్తే 4 కోట్ల మందికి ఉపయోగకరమన్నారు. గ్రామీణ రహదారుల కోసం కూడా రూ. 62,500 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. ఈ సోషల్ మీడియా జమానాలో అందరూ రాసేవాళ్లేనని, రాజకీయ పార్టీలు వందల ఛానల్స్ పెట్టేస్తున్నాయని... ఒక వార్త నిజమా? కాదా? అని తెలుసుకునే లోపే విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, బెజవాడ దుర్గమ్మ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని... గడిచిన ఐదేళ్లలో ఇలా జరిగాయా? అని ప్రశ్నించారు.