Begin typing your search above and press return to search.

బాబు జమిలికి ఓకే వెనక మోడీ అభయం ?

ఎవరికైనా అధికారమే పరమావధి. అలాంటిది ఉన్న అధికారం కత్తిరించుకుని పోతుందంటే బాధ అంతులేనిది గా ఉంటుంది.

By:  Tupaki Desk   |   15 Oct 2024 6:30 AM GMT
బాబు జమిలికి ఓకే వెనక మోడీ అభయం ?
X

ఎవరికైనా అధికారమే పరమావధి. అలాంటిది ఉన్న అధికారం కత్తిరించుకుని పోతుందంటే బాధ అంతులేనిది గా ఉంటుంది. ఒక్క రోజు రాజు అయినా అది గొప్ప జాతకమే అని అంతా అంటారు. అలాంటిది ఒక్క రోజు కాదు ఏకంగా రెండేళ్ల అధికారానికి కోత వేసేలా కేంద్రం జమిలి ఎన్నికల అజెండాతో ముందుకు వస్తొంది. కేంద్రంలోని ప్రభుత్వానికి జమిలి ఎన్నికల వెనక ఉన్న ఆలోచనలు వేరు. వ్యూహాలు కూడా వేరు.

అరకొర మెజారిటీతో కేంద్రంలో బీజేపీ ఉంది. పూర్తి స్థాయి అధికారం గత రెండు టెర్ములు చలాయించిన బీజేపీ పెద్దలకు ఈ పరిణామం అసలు మింగుడుపడటం లేదు. ఊతకర్రల మీద ఆధారపడి ఎంతకాలం ఈ సర్కార్ బండిని నెట్టడం అని కూడా అనుకుంటున్నారు. దాంతో పాటు మరోసారి అధికారంలోకి రావాలీ అంటే సరైన సమయం చూసి ఎన్నికలకు పోవడమే మార్గమని భావిస్తున్నారు. అలా కాకుండా ఈ ఊతకర్రల ప్రభుత్వాన్ని అయిదేళ్ళూ నెట్టించుకుంటూ పోతే 2029లో ఇంకా దారుణమైన ఫలితాలు వస్తాయన్న ఆందోళన కూడా ఉందిట.

సో జమిలి అన్నది కేంద్రానికి బీజేపీకి అలా అతి ముఖ్యమైన ఎత్తుగడ. మరి ఏపీలో సీఎన్ చూస్తే అలా కాదు కదా. చంద్రబాబుకు టీడీపీకి చరిత్రలో ఎరగని సీట్లు వచ్చిన ఎన్నికలు 2024లో జరిగాయి. మొత్తం సీట్లలో తొమ్మిది మాత్రమే ఓడి టోటల్ గా గెలవడం అంటే టీడీపీకి రికార్డు. అలాగే జనసేన మొత్తం 21 సీట్లు గెలిచింది. బీజేపీ పదికి ఎనిమిది గెలిచింది.

వైసీపీ దారుణంగా 11 సీట్లకే పరిమితం అయింది. కూటమిదే అసెంబ్లీ. మొత్తానికి మొత్తం హవా చేస్తున్న సందర్భం ఉంది. అయిదేళ్ళ పాటు అధికారంలో ఉంటే అపరిమితమైన అధికారంతో పాటు రాజ్యసభలోనూ శాసనమండలిలోనూ పూర్తి సీట్లు దక్కుతాయి. అంతే కాదు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరిస్తే మళ్లీ ఆదరణ దక్కుతుంది. అమరావతి పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేస్తే చరిత్రలో చంద్రబాబు వైభవం శాశ్వతం అవుతుంది.

ఇలా అన్ని లెక్కలూ చూసుకుంటే షెడ్యూల్ ప్రకారం 2029 ఎన్నికలు రావడమే చంద్రబాబుకు రెండు వందల శాతం కరెక్ట్. కానీ 2027లోనే ఎన్నికలకు కేంద్రం రెడీ అవుతోంది అన్న వార్తలు వచ్చాయి. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను కలసినపుడు జమిలి ఎన్నికల మీద ఒక క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం జమిలి ఎన్నికలను జరిపించడానికి సిద్దపడుతోందని అర్ధం అయింది అని అంటున్నారు

అదే సమయంలో బాబుకు తగిన అభయం కూడా కేంద్ర వర్గాల నుంచి దక్కింది అని అంటున్నారు. అయిదేళ్ళలో పూర్తి చేయాల్సిన పనులు వాయువేగంతో మూడేళ్ళలో పూర్తి చేసుకోవడానికి తగిన ఆర్ధిక హార్ధిక సాయం కేంద్రం నుంచి ఇతోధికంగా దక్కుతుంది అని అంటున్నారు. అంటే అమరావతి పోలవరం వంటి వాటికి నిధుల కొరత లేకుండా చూడడంతో పాటు ఏపీకి దండీగా ఆర్ధిక సాయం చేయడం ద్వారా కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కూడా సహకరించేలా మాట ఇచ్చారని అంటున్నారు.

దాంతో పాటు 2026లోనే అసెంబ్లీ సీట్లను పెంచుతారని దాని వల్ల ఏపీలో మరో యాభై సీట్లు పెరుగుతాయని వాటి వల్ల అధికారంలో ఉన్న టీడీపీకే రాజకీయంగా భారీగా లబ్ది సమకూరుతుందని అంటున్నారు. ఇలా అన్ని విధాలుగా తాము అండగా ఉంటామన్న భరోసా కేంద్ర పెద్దల నుంచి రావడం వల్లనే చంద్రబాబు జమిలి ఎన్నికలకు పచ్చ జెండా ఊపారని అంటున్నారు

దాంతో బాబులో స్పీడ్ పెరిగిందని ఆయన వరసబెట్టి చేయాల్సిన పనుల అజెండాను కూడా మార్చుకున్నారని మూడేళ్ళకే తన పొలిటికల్ క్యాలెండర్ ని సిద్ధం చేసుకుని ముందస్తు ఎన్నికలకు వడివడిగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జమిలి ఎన్నికలు టీడీపీకి జనసేనకు బీజేపీకి లాభంగా ఉండేలా ఏపీ విషయంలో కేంద్ర పెద్దలు తగిన చర్యలు తీసుకుంటారు అని అంటున్నారు. దాంతోనే రెండేళ్ళు ముందుగా ఎన్నికలు జరిగినా అదే మెజారిటీతో సీట్లు గెలిచేలా బాబు మార్క్ పాలిటిక్స్ కి తెర తీస్తున్నారు అని అంటున్నారు. సో చూడాలి మరి ఏమి జరుగుతుందో.