జమిలి ఎన్నికలు.. బాబు కూటమికి మంచిదేనా ..!
రాష్ట్రంలో జమిలి ఎన్నికలకు సిద్ధమని కూటమి సారథి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.
By: Tupaki Desk | 18 Oct 2024 12:30 PM GMTరాష్ట్రంలో జమిలి ఎన్నికలకు సిద్ధమని కూటమి సారథి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ జమిలికి రెడీ అవుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే జమిలిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక, రాష్ట్రాలు దీనిని ఆమోదించాలి. ఇది కూడా సులభమే. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు, బీజేపీ ఏకపక్షంగా గెలుచుకున్న రాష్ట్రాలు వెరసి మొత్తం 15 వరకు ఉన్నాయి.
దీంతో జమిలికి సంబంధించిన బిల్లులు చట్టాలను ఆయా రాష్ట్రాలు ఆమోదించనున్నాయి. ఇక, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం వ్యతిరేకత వచ్చినా.. పెద్దగా లెక్కచేయాల్సిన అవసరం లేదు. ఇక, పార్లమెంటు లోనూ ఎన్డీయే కూటమి పార్టీలే ఎక్కువగా ఉన్నందున అక్కడ కూడా ఇబ్బంది లేదు. రాజ్యసభలో కొంత సెగ తగిలినా.. జగన్ వంటివారి ద్వారా గట్టెక్కేయొచ్చు. మొత్తానికి ఈ ఏడాది లేదా వచ్చే జనవరి నాటికి జమిలికి సంబంధించిన కసరత్తు పూర్తికానుంది.
మొత్తంగా చూస్తే.. జమిలికి మరో ఏడాదిన్నర లేదా రెండేళ్లలో దేశం మొత్తం రెడీ అవుతుంది. అప్పుడు అన్ని అసెంబ్లీలు, పార్లమెంటులకు ఒకేసారి ఎన్నికలు వస్తాయి. ఇదే జరిగితే ఏపీలో పరిస్థితి ఏంటి? అన్నది ప్రశ్న. పైకి చంద్రబాబు ఓకే చెప్పినా.. రెండేళ్లలోనే ఎన్నికలు వస్తే.. ఆయన కలలు కంటున్న అమరావతిని ఎంత వరకు పూర్తి చేయగలుగుతారు? అబివృద్దిపథంలో ఏమేరకు ముందుకు సాగుతారు? అనేవి ప్రశ్నలు. వీటికితోడు.. సూపర్ సిక్స్ పై ప్రజల ఆశలు ఎక్కువగా ఉన్నాయి.
వీటిని సకాలంలో ప్రారంభించాలని ఉన్నా.. మాతృవందనం వంటి పథకాలకు ఒకటి కాదు రెండు కాదు.. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలి. ఇదే జరిగితే.. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులకు నిధుల సమస్య వచ్చి.. మళ్లీ అవి తిరోగమనం బాటపడతాయి. అలాగని సూపర్ సిక్స్‌కు జైకొట్టకపోయినా.. సాధారణ ప్రజల్లోనూ.. వాటిపై ఆశలు పెట్టుకున్న ఒక సెక్షన్ ప్రజల్లోనూ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. ఇది సర్కారుకే ముప్పుగా మారినా ఆశ్చర్యం లేదు. సో.. జమిలికి జై కొట్టడం ఈజీనే కానీ, ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడం అంత ఈజీయేనా? అనేది కూడా చంద్రబాబు ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది.